Begin typing your search above and press return to search.

పక్కా లోకల్ అంటున్న అనకాపల్లి...?

By:  Tupaki Desk   |   25 Feb 2022 12:30 AM GMT
పక్కా లోకల్ అంటున్న అనకాపల్లి...?
X
నేను పక్కా లోకల్ అంటే పాలిటిక్స్ లో ఆ కిక్కే వేరప్పా. ఎవరెన్ని దేశాలు తిరిగినా ఎంత విశాలమైన గుండె ఉందని చెప్పుకున్నా రాజకీయాల్లో మాత్రం అవన్నీ చెల్లవు. ఇక్కడ కులం, మతం తో పాటు ప్రాంతం కూడా చాలా సెంటిమెంట్ గా ఉంటుంది. అందుకే పక్కా లోకల్ కార్డు ఎపుడూ ఎవరినైనా  సక్సెస్ ట్రాక్ లోకి తీసుకెళ్తుంది.

ఇపుడు అలాంటి కార్డుని అనకాపల్లి పొలిటీషియన్స్ వాడబోతున్నారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే గిడివాడ అమరనాధ్ గాజువాక వాసి. అక్కడ ఆయన తన నియోజకవర్గం వదిలేసి అనకాపల్లి మీదకు పడడం ఏంటి అని లోకల్ గా ఉన్న వైసీపీ నేతలు రగులుతున్నారు.

నిజానికి అనకాపల్లి అంటే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాస్టారు గుర్తుకువస్తారు. అన్న గారి టైమ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో సార్లు అక్కడ నుంచి గెలిచారు. మంత్రిగా పనిచేశారు, అనేక కీలక పదవులు అందుకున్నారు. 2019లో ఆయన వైసీపీలో చేరడం వెనక తన కుమారుడు దాడి రత్నాకర్ కి టికెట్ కోసమే. అయితే అప్పటికే గుడివాడకు టికెట్ ఫిక్స్ చేసిన జగన్ నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అనేశారు.

ఇపుడు ఆ పాయింట్ మీదనే పక్కా లోకల్ కార్డుతో వైసీపీలో కధ సాగుతోంది. సేమ్ ఇదే సీన్ టీడీపీలో కూడా ఉంది. పెందుర్తికి చెందిన పీలా గోవింద్ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇచ్చారు. కానీ 2024లో మాత్రం అలా కాకూడదు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు పంతం మీద ఉన్నారు. ఈసారి కచ్చితంగా తనకే టికెట్ దక్కాలని ఆయన కోరుకుంటున్నాను. తాను పక్కా లోకల్ అని ఆయన కార్డు బయటకు తీస్తున్నారు.

ఇక వారూ వీరు కాదు, కులం కార్డుతో ఒక బిగ్ షాట్  కూడా అనకాపల్లి సీటు కోసం ట్రై చేస్తున్నారు. అనకాపల్లిలో కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు, తరువాత స్థానం గవరలది. అయితే కాపులు ఎపుడు గెలిచినా కూడా నాన్ లోకలే ఉంటున్నారని, ఈసారి పక్కా లోకల్ కాపులకే సీటు ఇవ్వాలని ఆయన అంటున్నారు. బడా పారిశ్రామిక వేత్తగా ఉన్న  ముత్యాల వెంకటేశ్వరరావు ఈసారి లోకల్ కాపునే ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫ్రెష్ గా రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాను అన్నది చెప్పకపోయినా అప్పటి పరిస్థితుల బట్టి టికెట్ సొంతం చేసుకుని ప్రధాన పార్టీ అభ్యర్ధిగానే బరిలో ఉండాలని చూస్తున్నారు. మొత్తానికి ఈసారి పక్కా లోకల్ కార్డు తో అనకాపల్లి రాజకీయాలు హీటెక్కనున్నాయి అంటున్నారు. అసలే కొత్త జిల్లా దాంతో కొత్త రాజకీయం కలసి వస్తే ఎవరికి లక్ వరిస్తుందో చూడాల్సిందే మరి.