Begin typing your search above and press return to search.

రంగా పేరుతో రాజకీయం...వైసీపీ టీడీపీ టార్గెట్ అతనే....?

By:  Tupaki Desk   |   26 Dec 2022 9:23 AM GMT
రంగా పేరుతో రాజకీయం...వైసీపీ టీడీపీ టార్గెట్ అతనే....?
X
వంగవీటి మోహన రంగా. ఈ రోజుకు సరిగ్గా ముప్పయి నాలుగేళ్ళ క్రితం దారుణ హత్య కావించబడ్డారు. ఆయన నిరాహార దీక్ష చేస్తున్న చోటనే తెల్లవారు జామున ఒక బస్సులో వచ్చిన కొందరు దుండగులు ఆయన్ని హత్య చేసారు. ఆనాడు ఏపీ మొత్తం అట్టుడికిపోయింది. రంగా హత్య తరువాత కోస్తా జిల్లాలు ప్రత్యేకించి బెజవాడ మంటల్లోనే కొన్నాళ్ళ పాటు ఉంది.

రంగా చనిపోయేనాటికి వయసు నలభయ్యేళ్ళు. ఆయన రాజకీయ జీవితం కూడా అయిదారేళ్ళు మాత్రమే. ఆయన మొదట కార్పోరేటర్ గా ఆ మీదట ఎమ్మెల్యేగా గెలిచారు మూడున్నరేళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉండగానే రంగా ప్రత్యర్ధులకు బాగా టార్గెట్ అయ్యారు. ఆయన్ని దారుణంగా హత్య చేశారు.

ఇక ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రంగా హత్య తరువాత ఎన్టీయార్  సర్కార్ మొదటి సారి గద్దె దిగింది. కేవలం 73 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక విధంగా ఇది తెలుగుదేశానికి అతి పెద్ద ఓటమిగా అంతా చూసారు.

ఆ తరువాత అంటే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి 1994లో తెలుగుదేశం 226 సీట్లు గెలుచుకుంది. అంటే ఆ ఎన్నికలలో రంగా ప్రభావం ఉంటే గెలవదు కదా కాపుల ఆగ్రహం ఉంటే తెలుగుదేశం ఓడేది కదా అన్న చర్చ కూడా వస్తుంది. 1999లో మరోసారి టీడీపీ గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి వైఎస్సార్ పాదయాత్ర ఆయన పాలన కారణాలుగా చెబుతారు.

అదే టైంలో 2009లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పెట్టినా రంగా ప్రభావం ఎంత ఉంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. 2014లో తెలుగుదేశం మరోసారి గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. ఈ రెండు పార్టీలకు కాపుల మద్దతు ఇచ్చారు ఇక 2024 ఎన్నికల్లో కాపులు ఎవరి పక్షం అన్నదే చర్చగా ఉంది. ఏపీలో కాపులకు ఇపుడు జనసేన ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆ పార్టీ వైపుగా కాపులు పోలరైజ్ అవుతున్నారు.

అందుకు వంగవీటి రంగా పేరిట కాపునాడు సభలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. రంగా వారసత్వం కోసం జనసేన గట్టిగా ప్రయత్నాలు చేస్తూంటే దాన్ని పూర్తిగా ఆ వైపు పోనీయకుండా కాపుల ఓట్లలో తమ వాటా చూసుకోవడానికే వైసీపీ టీడీపీ చూస్తున్నాయి అని అంటున్నారు. ఇక వంగవీటి రంగా పేరుతో వరసబెట్టి జరుగుతున్న వర్ధంతి కార్యక్రమాలను పోటాపోటీగా వైసీపీ టీడీపీ చేపడుతున్నాయి.

వాటికి రంగా తనయుడు రాధాను కూడా ఆహ్వానించి ఆయన తమవాడే అని చెప్పుకోవడానికి చూస్తున్నాయి. ఇదంతా రాజకీయం కోసమే అని అంటున్నారు. నిజానికి చూస్తే వంగా బతికున్న రోజులలో కాపు నాయకుడిగానే కాదు అన్ని వర్గాల నేతగా ఆయన ఉన్నారు. ఆయన్ని అన్ని సామాజిక వర్గాలు తమ సొంతం చేసుకున్నాయి. ఆ విధంగా ఆయన ఎదిగారు. ఆయన బతికి ఉంటే తమకు ఇబ్బంది అని కొన్ని శక్తులు ఆయన్ని చంపించాయి.

అయితే రంగా మరణం తరువాత ఆయన వారసత్వాన్ని కొనసాగించడంలో కుమారుడు సహా చాలా మంది విఫలం అయ్యారని అంటున్నారు. రంగా మాదిరిగా అన్ని వర్గాలను కలుపుకుని పోయి ఉంటే ఈ పాటికి కాపులకు రాజ్యాధికారం సొంతం అయ్యేది అని చెబుతారు. కానీ ఆ విషయంలో అనుకున్న తీరున అడుగులు పడడంలేదు. మరో వైపు ఎన్నికలు వచ్చిన ప్రతీ సందర్భంలో రంగా ప్రసక్తి తీసుకురావడం కాపుల ఓట్లకు గేలం వేయడానికే అన్ని పార్టీలు చూస్తున్నాయి.

ఇక ఏపీలో చూస్తే మూడవ పక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కూడా కాపు సామాజికవర్గం నేత కావడంతో ఆయన్ని అడ్డుకోవడానికే రంగా జపం చేస్తున్నాయి ఇతర రాజకీయ పార్టీలు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ కి అంతకంతకు జనాదరణ పెరగడం వల్ల కూడా ఆయన్ని ఢీ కొట్టడానికి రంగా ఆయుధాన్ని వాడుకుంటున్నారు అని అంటున్నారు. రంగా కుమారుడు రాధా తమతో ఉంటే చాలు కాపుల ఓట్లు తమ సొత్తు అని వైసీపీ టీడీపీ ఆలోచిస్తున్నాయి.

అయితే ఎంతటి రంగా కుమారుడు అయినా రాధా ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసినా కూడా అక్కడ ఆ పార్టీ గెలవలేదు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాధా రంగా కుమారుడిగా ఉన్నా జనం మాత్రం అప్పటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని మాత్రమే తమ తీర్పు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ణి నిలువరించాలి అంటే రాధాతోనే అన్న నిర్ణయానికి వైసీపీ టీడీపీ  రావడం ద్వారా ఎంత మేర  రాధాతో జనంలోకి వెళ్ళి నెగ్గుతారు అన్నది చూదాలి.

అదే టైంలో రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నా కూడా వైసీపీ ఆయనమీద మోజు పెంచుకుంటోంది. అలాగే రాధాను ఇంతకాలం పట్టించుకోని టీడీపీ ఇపుడు ఆయనకు అతి పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది. ఇవన్నీ చూసినపుడు రాధా ఇపుడు రెండు ప్రధాన పార్టీలకు కావాల్సిన వారు అయిపోయారు. దాంతో మరి ఏపీ రాజకీయాలు ఏ మేరకు మారుతాయన్నది పక్కన పెడితే టార్గెట్ పవన్ గా మాత్రమే ఈ ఎత్తుగడతో వైసీపీ టీడీపీ ఉన్నాయన్నది స్పష్టం అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.