Begin typing your search above and press return to search.

జనాలే సమిధలు : రోడ్డు మీదకొచ్చిన రాజకీయం

By:  Tupaki Desk   |   30 Dec 2022 8:33 AM GMT
జనాలే సమిధలు :  రోడ్డు మీదకొచ్చిన రాజకీయం
X
ఎంత జనం సభకు వస్తే అంత విజయం లభిస్తుంది అన్న రొడ్డ కొట్టుడు లెక్కలు పెట్టుకోవడం ఎక్కువైపోతోంది. ఒక వైపు కాలం వేగంగా పరుగులు తీస్తోంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇంట్లో కూర్చుని అమెరికాలో వాళ్లతో కులాసాగా మాట్లాడుతున్న రోజులు ఇవి. అలాంటిది ఇంకా ఎర్లీ సెవెంటీస్ ఎయిటీస్ రోజులను పట్టుకుని వెళ్ళాడడం, జనాల వద్దకు వెళ్ళాలనుకోవడం, వారిని తమ దగ్గరలకు తరలించుకుని ఇది మా బలం అని జబ్బలు చరచుకోవడం చూస్తే ఇంకెంతకాలం ఈ మొద్దు రాజకీయం అని అనిపించక మానదు.

కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటను చూసిన తరువాత ఇలా జనాలను ఒకే చోట కిక్కిరించేలా చేసి మీటింగులు పెట్టడం అవసరమా అన్న ప్రశ్నలు రాక మానవు. నిజానికి ఏ నాయకుడి సభలకు అయినా జనాలు ఊరకే వస్తున్నారా అంటే అసలు రారు.

పూర్వం రోజులలో నాయకుడు అంటే జనాలు వెంట నడిచేవారు. ఇపుడు అంతా తరలింపు వ్యవహారమే. ఆ మాత్రం సౌభాగ్యానికి గొప్పలు పోవడం మాకే ఎక్కువ జనాలు వచ్చారని చూపించుకోవడం వల్లనే పోటా పోటీగా తయారైంది. అది కాస్తా చివరికి డ్రోన్ల కెమెరాల షూటింగులు చేస్తూ జనమంతా మా వైపే అంటూ ప్రచారం చేసుకునే దాకా కధ నడుస్తోంది.

నిజానికి చూస్తే గతంలోలా పరిస్థితి లేదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా క్షణాలలో జనాలకు చేరుతుంది. టీవీలు ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది వార్తా పత్రికలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను మోసుకొచ్చే స్మార్ట్ ఫోన్లు అందరి వద్దా ఉన్నాయి. అందువల్ల తాము చెప్పాల్సిన విషయాలు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని జనాలకు చేరువ చేయవచ్చు. అలాగే యాత్రలు చేసినా రోడ్ షోలు చేసినా పరిమితమైన సంఖ్యలో చేయడం మంచిది. ప్రజలు తమ సభలకు వస్తున్నారు అంటే వారిని సురక్షితంగా తిరిగి పంపించేలా చూసుకోవాలి.

ఇక గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాతనే నాయకుల సభలు స్టార్ట్ అయ్యేవి. ఒక నెల రోజుల పాటు మాత్రమే ఈ హడావుడి ఉండేది. జనాలు కూడా తట్టుకునే వారు కాదు, ఇపుడు సీన్ మారుతోంది. ప్రతీ నిత్యం జనాలకు చేరువ ఉండాలన్న యావ పెరిగింది. ఆ ఆరాటంలో రాజకీయ పోరాటంలో జనాలలోకి నేతలు వస్తున్నారు. అగ్ర నేతలు ప్రజలతో ఉండాలని చూస్తున్నారు.

ఇది మంచిదే కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ పర్యటనలు ఉండాలి. అంతే కానీ జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట జనాలు అంతా కలివిడిగా తిరిగే చోట సభలను పెట్టి తమ బల ప్రదర్శనలకు రోడ్లను వేదికలుగా చేసుకుంటే జనాలకు ఇబ్బందులతో పాటు కందుకూరు తొక్కిసలాట లాటి ఉదంతాలు జరుగుతాయి. ఈ విషయం ఇపుడు మరింతగా అంతా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు వస్తున్నాయి.

దాంతో 2023 నుంచి యాత్రలు మొదలు కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తూంటే లోకేష్ పాదయత్ర చేయబోతున్నారు. నిజానికి ఏపీలో పాదయాత్రకు ఆద్యుడు అయిన డాక్టర్ వైఎస్సార్ పరిమితమైన సంఖ్యతోనే పాదయాత్ర చేసేవారు. ఆయన వచ్చి వివిధ ప్రాంతాలో తిరిగేవారు. అంతే తప్ప తన వెంట వేలాది మందిని తిప్పుకుని రోడ్లను బ్లాక్ చేసేవారు కాదు, ఇపుడు కూడా పాదయాత్ర చేయాలనుకునే వారు చాలా పరిమిత సంఖ్యలోనే జనాలను ఉంచుకుంటే అందరికీ మంచిది.

ఇక జనాలు ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా అన్నది ఇక్కడ ఎపుడూ కొలమానం కాదు, జనాలు వేలం వెర్రిగా వచ్చినట్లు అయితే ప్రజారాజ్యం అధినేత హోదాలో చిరంజీవికి జన సునామీయే వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జనాలు ఎపుడూ కిటకిటలాడుతూనే ఉంటారు. అందువల్ల జనాలు వచ్చారు తాము గెలిచేశామనుకుంటే పొరపాటు. జనానికి తాము చెప్పిన సందేశం ఏమిటి. అది వారికి సజావుగా చేరుతోందా లేదా అన్నదే కొలమానంగా పెట్టుకుంటేనే కందుకూరి విషాదానికి ఇక ముగింపు పలుకుతాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.