Begin typing your search above and press return to search.

ముహూర్తం ఫిక్స్ - పొంగ‌ల్ పోగానే విస్త‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   4 Jan 2019 4:44 PM GMT
ముహూర్తం ఫిక్స్ - పొంగ‌ల్ పోగానే విస్త‌ర‌ణ‌!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి దాదాపు పాతిక రోజులు కావ‌స్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒకే ఒక్క మంత్రితో ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌రణ కోసం ఎమ్మెల్యేలంతా చ‌కోర‌ప‌క్షుల్లా ఎదురుచూస్తున్నారు. కేబినెట్ లో స్థానం ద‌క్కించుకునేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేసీఆర్ - కేటీఆర్ ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు శ‌త‌విధాలా కృషిచేస్తున్నారు.

మంచి ముహూర్తాలు లేని కార‌ణంగా ఇన్నాళ్లూ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను కేసీఆర్ వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. అయితే - ఇప్పుడు ఆయ‌న కేబినెట్ ఏర్పాటుకు డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి ప‌ర్వ‌దినం పూర్తి కాగానే 18వ తేదీన కేబినెట్ ను విస్త‌రించి - అదే రోజు మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న చేసిన‌ట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలంగాణలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మంత్రివర్గ విస్తరణ - శాసనసభ సమావేశాలు నిర్వహించరాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన - పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు - పంచాయ‌తీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశ‌మ‌య్యారు. ఎన్నికల నియమావళిని అధ్యయనం చేశారు.

మంత్రివర్గ విస్తరణకు - అసెంబ్లీ సమావేశాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏమాత్రం అడ్డంకి రాదని అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎప్పుడైనాస‌రే చేసుకోవ‌చ్చ‌ని తేల్చారు. ఇదే విష‌యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లార‌ని - ఎన్నిక‌ల సంఘం కూడా సీఎం కార్యాల‌య వాద‌న‌తో ఏకీభ‌వించింద‌ని తెలుస్తోంది. దీంతో 18న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.