Begin typing your search above and press return to search.

ముంబై ఇండియన్స్ కు బాహుబలి క్రికెటర్ దూరం.. ఇక బ్యాటింగ్ కోచ్

By:  Tupaki Desk   |   15 Nov 2022 10:51 AM GMT
ముంబై ఇండియన్స్ కు బాహుబలి క్రికెటర్ దూరం.. ఇక బ్యాటింగ్ కోచ్
X
వెస్టిండీస్ క్రికెటర్... ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బాహుబలి.. పొట్టి ఫార్మాట్ లో భీకర ఆల్ రౌండర్.. కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు బైబై చెప్పాడు. అయితే, అతడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా కొనసాగుతాడు. ఇదే ఫ్రాంచైజీకి రికార్డు స్థాయిలో 13 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న అతడి సేవలను ఇలా ఉపయోగించుకోవాలని యాజమాన్యం నిర్ణయించినట్లుంది. దీంతో పొలార్డ్ కు బ్యాటింగ్ కోచ్ పదవి దక్కింది. కాగా, ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంలో పొలార్డ్ పాత్ర అత్యంత కీలకం. కానీ, రెండేళ్లుగా అతడి ఫామ్ దారుణంగా ఉంది. గతేడాది మరీ పేలవ ప్రదర్శన కనబర్చాడు.

13 ఏళ్లు ముంబైతోనే..ముంబై ఇండియన్స్ తో 2010లో పొలార్డ్ అనుబంధం మొదలైంది. అయితే, గతేడాది జట్టుగా దారుణ ప్రదర్శనతో ముంబై పేరు మసకబారింది. ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాను కాదని పొలార్డ్ ను అట్టిపెట్టుకున్న ముంబైకి తగిన శాస్తి జరిగిందన్న వాదనలు వినిపించాయి. దీంతోనే ఈసారి పొలార్డ్ ను ముంబై రిలీజ్ చేసింది. అయితే, పొలార్డ్ -ముంబై అనుబంధం మరో రూపంలోనూ సాగనుంది. యూఏఈ లీగ్ ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ కోచ్ గా అతడు సేవలందిస్తాడు. వాస్తవానికి వచ్చే సీజన్ కోసం పొలార్డ్ ను వేలంలోకి వదిలేయాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. కానీ పొలార్డ్.. మేనేజ్‌మెంట్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వెల్లడించాడు. మరికొన్ని రోజులు ఆడాలని ఉన్నా.. ముంబై ఇండియన్స్‌తో ఆడే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా జట్టుకు సేవలందిస్తానని పేర్కొన్నాడు.

ఐపీఎల్ కెరీర్ సాంతం ముంబైతోనే ఐపీఎల్ లో పొలార్డ్ కెరీర్ సాంతం ముంబై ఇండియన్స్ తోనే సాగింది. లీగ్ లో ఇది చాలా అరుదు. బెంగళూరుకు కోహ్లి, చెన్సైకి ధోనీ మాత్రమే ఇలా ఆడగలిగారు. అయితే, వీరు లీగ్ మొదటి నుంచి ఇదే ఫ్రాంచైజీలకు ఉన్నారు. పొలార్డ్ రెండేళ్ల తర్వాత వచ్చాడు. సునీల్ నరైన్ కోల్ కతాకు 2011 నుంచి ఆడుతున్నాడు. ఈ లెక్కన అతడి కంటే పొలార్డ్ సీనియర్. కాగా, 2022 సీజన్ లో పొలార్డ్ ఐపీఎల్‌లో 171 ఇన్నింగ్స్‌లలో 3412 పరుగులు చేశాడు. సగటు 28.67. స్ట్రైక్ రేట్ 147.32. మొత్తం 16 అర్ధ సెంచరీలు చేశాడు. లీగ్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడు.

ఆ లీగ్ ప్రదర్శన చూసి.. 2009లో చాంపియన్స్ లీగ్ టి20లో పొలార్డ్ ప్రదర్శన అసామాన్యం. భీకర హిట్టింగ్, అథ్లెటిక్ ఫీల్డింగ్, బంతితో అద్భుతాలు చేసిన అతడిని మరుసటి ఏడాది ముంబై ఇండియన్స్ తీసుకుంది. అయితే, ప్రాథమిక ధర 2 లక్షల డాలర్లు కాగా, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా పోటీపడ్డాయి. ముంబై 7.50 లక్షల డాలర్లు వెచ్చించి పొలార్డ్ ను ఖాతాలో వేసుకుంది. అయితే, దీనికిముందు ఏడాదిలో ఇదే పొలార్డ్ ను ఏ జట్టూ తీసుకోకపోవడం విశేషం. 2009 నాటి వేలంలో అతడి ప్రాథమిక ధర 60 వేల డాలర్లు కాగా.. కొనేందుకు ఏ జట్టూ మొగ్గుచూపలేదు.

ఆ ఇద్దరిలో ఇతడు ఒకడు ఐపీఎల్ లో 3 వేల పరుగులు చేయడమే కా.. 50 పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అయితే, మరొకరు పొలార్డ్. అంతేకాదు.. పొలార్డ్ లీగ్ లో కొట్టిన మొత్తం సిక్సర్లు 223. ఇది ఐదో అత్యధికం. 14 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇందులో 2013 ఫైనల్ కూడా ఉంది. కాగా, ఇన్నళ్లలో ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారీ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ ఆటోమేటిక్ గా రిటైన్ చేసుకునేది. గతేడాది తీవ్ర పోటీలోనూ రూ.6 కోట్లు పెట్టి తీసుకుంది. అయితే, 11 మ్యాచ్ లాడిన అతడు కేవలం 144 పరుగులే చేయగలిగాడు. సగటు 14.40 మాత్రమే. స్ట్రయిక్ రేట్ 107. కాగా, కొన్నాళ్లుగా పొలార్డ్ గాయాలతో సతమతం అవుతున్నాడు. మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడాడు.

పొలార్డ్ ను వదలించుకుని పైసలు మిగుల్చుకుని గతేడాది ఐపీఎల్ లో దారుణంగా ఆడిన ముంబై ఇండియన్స్ ఈసారి జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తోంది. పొలార్డ్ ను వదిలించుకున్న ఆ జట్టు.. తద్వారా మిగిలిన డబ్బును ఇతర ఆటగాళ్లపై వెచ్చించే అవకాశం ఉంది. ముంబై.. ఓ ఆటగాడిపై పెట్టుబడి పెడితే, అతడినుంచి పూర్తిస్థాయి ఫలితం పిండుకుంటుంది. అనుబంధాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తుంది. ఇప్పుడూ అదే సూత్రం మీద ఎవరిపై పెట్టుబడి పెడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.