Begin typing your search above and press return to search.

పొలార్డ్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే..

By:  Tupaki Desk   |   5 Sep 2017 11:09 AM GMT
పొలార్డ్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే..
X
వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ పేరెత్తగానే అనేక వివాదాలు గుర్తుకొస్తాయి. ఐపీఎల్ సందర్భంగా అతను చాలామందితో గొడవపడ్డాడు. మైదానంలో హద్దులు దాటి ప్రవర్తించాడు. ఐతే ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు పొలార్డ్. తమ ప్రత్యర్థి బ్యాట్స్ మన్ సెంచరీ కానివ్వకుండా అతను నోబాల్ వేసి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం చర్చనీయాంశమవుతోంది. అతడిపై సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ అభిమానులు తిట్టి పోస్తున్నారు. వెస్టెండీస్ లో జరిగే కరీబియన్ ప్రిమియర్ లీగ్ టీ20 టోర్నీ సందర్భంగా పొలార్డ్ ఇలా ప్రవర్తించాడు.

ఈ టోర్నీలో పొలార్డ్ బార్బడోస్ ట్రిడెంట్స్ కు ఆడుతున్నాడు. ఐతే నెవిస్ పాట్రియాట్స్ తో మ్యాచ్ సందర్భంగా పొలార్డ్ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. బార్బడోస్ బౌలర్లను ఉతికారేసిన ప్యాట్రియాట్స్ బ్యాట్స్ మన్ లూయిస్ 32 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. ప్యాట్రియాక్స్ ఒక్క పరుగు చేస్తే విజయం సాధించే స్థితిలో ఉండగా.. లూయిస్ సెంచరీకి నాలుగు పరుగులే అవసరమయ్యాయి. లూయిస్ ఉన్న ఊపు చూస్తే అతడికి బౌండరీ సాధించడం పెద్ద విషయం కాదు. సింగిలో డబులో వచ్చేట్లుంటే ఆగి మరీ సెంచరీ పూర్తి చేయొచ్చు. ఈ స్థితిలో పొలార్డ్.. లూయిస్ సెంచరీ కానివ్వకూడదన్న దురాలోచనతో నోబాల్ వేశాడు. ఆ బంతి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగానే నోబాల్ వేశాడని స్పష్టమవుతుంది. ఆ బంతికి లూయిస్ సెంచరీ చేస్తే.. టీ20 క్రికెట్లో రెండో వేగవంతమైన శతకం అయ్యుండేది. ఐపీఎల్లో గేల్ 30 బంతుల్లో సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. కానీ లూయిస్ సెంచరీకి పొలార్డ్ కావాలనే అడ్డుపడ్డాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వ్యాఖ్యాత డానీ మోరిసన్ సహా పలువురు మాజీలు పొలార్డ్ తీరును తప్పుబట్టారు.