Begin typing your search above and press return to search.

వారి ఓట్ల కోసం పోలింగ్ బూత్ అలా మారింది!

By:  Tupaki Desk   |   9 May 2019 4:37 AM GMT
వారి ఓట్ల కోసం పోలింగ్ బూత్ అలా మారింది!
X
ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్ ల‌కు వెళుతుంటాం. అయితే.. పోలింగ్ బూత్ చూసేందుకు ఓట్లు వేయాల‌న్న ఆలోచ‌న ఎప్పుడైనా మీకు వ‌చ్చిందా? అస‌లు అలాంటి ప‌రిస్థితి ఉంటుందా? అన్న సందేహం క‌లుగుతుందా? తాజా ఉదంతాన్ని చూస్తే నిజ‌మా? అన్న భావ‌న క‌ల‌గ‌ట‌మేకాదు.. ఇలాంటివి కూడా ఉంటాయా? అనిపించ‌క మానదు. ఎన్నిక‌ల వేళ‌.. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఎన్నికల అధికారుల ఆలోచ‌న‌ను చూస్తే.. అభినందించ‌కుండా ఉండ‌లేం. ఓటు వేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ని ఆదివాసీలు.. అతృత‌తో ఓటు వేసేందుకు వ‌చ్చేలా చేయ‌టం కోసం అధికారులు చేసిన ఆలోచ‌న‌ను అభినందించ‌కుండా ఉండ‌లేం. ఇంత‌కీ ఇదెక్క‌డంటే?

జార్ఖండ్ లోని హ‌జారీబాగ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆదివాసీల ఓట్లు చాలా ఎక్కువ‌. వారంతా బ‌తుకుపోరాటంలో కిందామీదా ప‌డుతుంటారు. ఏ రోజు క‌ష్టాన్ని ఆ రోజు న‌మ్ముకున్న వారికి ఎన్నిక‌ల మీద పెద్ద ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. ఓట్లు వేసేందుకు ప్ర‌త్యేకంగా రారు. దీంతో.. వారి చేత ఓట్లు వేయించేందుకు అధికారులు ఒక ఐడియా వేశారు.

అక్క‌డి ఆదివాసీల్లో చాలామంది రైలును చూసిందే లేదు. దీంతో.. పోలింగ్ కేంద్రాన్ని రైలుమాదిరి త‌యారు చేయించ‌ట‌మే కాదు.. అందులో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో.. తాము ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని రైలు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు బారులు తీరుతార‌ని అంచ‌నా వేశారు. అధికారుల అంచ‌నాలు త‌ప్పు కాలేదు.

తాము ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని రైలు ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తితో ఓట్లు వేసేందుకు బారులు తీరారు. అస‌లుసిస‌లు రైలు పెట్టె ఎలా ఉంటుందో.. అదే రీతిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు స‌ద‌రు రైలుబోగీ పోలింగ్ కేంద్రానికి 140వ నంబ‌రు ఇచ్చారు.

నిజ‌మైన రైలును ఎక్క‌ని గిరిజ‌నులు.. ఓట్లు వేసేందుకు రైలుపెట్టె షేపులో ఉన్న పోలింగ్ కేంద్రంలో త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. టికెట్టు తీసుకోకుండానే రైలు ఎక్క‌ట‌మే కాదు.. ఓటుహ‌క్కును వినియోగించుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. త‌మ ఐడియా స‌క్సెస్ అయినందుకు ఎన్నిక‌ల అధికారులు ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఎన్నిక‌ల కోసం వేసిన ఐడియా అదిరింది కదూ!