Begin typing your search above and press return to search.

నాలుగో ద‌శ‌!.. పోలింగ్ బ‌క్క‌చిక్కింద‌బ్బా!

By:  Tupaki Desk   |   30 April 2019 4:19 AM GMT
నాలుగో ద‌శ‌!.. పోలింగ్ బ‌క్క‌చిక్కింద‌బ్బా!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా సోమ‌వారం నాలుగో ద‌శ పోలింగ్ ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్ల‌మెంటు నియోజక‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఈ పోలింగ్ లో జ‌నాలు పెద్ద‌గా పోలింగ్ కేంద్రాల‌కే రాలేదు. మొన్న‌టిదాకా జ‌రిగిన మూడు ద‌శల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లివచ్చిన ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే నాలుగో ద‌శ‌లో మాత్రం అందుకు బిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపించింది. ఈ ద‌శ పోలింగ్ లో దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అప‌ర కుబేరుడు ముఖేష్‌ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దార్‌ రోడ్డులోని విల్లా థెరీసా హైస్కూల్‌ లో ముఖేష్‌ - ఆయన సతీమణి నీతా అంబానీ - కుమారులు ఆకాశ్‌ - అనంత్‌ - కుమార్తె ఇషా ఓటు వేశారు. ముఖేశ్ సోద‌రుడు - ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ సెంటర్‌ 203లో సచిన్‌ - ఆయన సతీమణి అంజలీ - కుమారుడు అర్జున్‌ - కూతురు సారా ఓటు వేశారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షారుఖ్‌ ఖాన్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షారుఖ్‌‌ - ఆయన సతీమణి గౌరీఖాన్‌ ఓటు వేశారు. ముంబైలోని జుహు పోలింగ్‌ కేంద్రంలో బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ - జయ బచ్చన్‌ - అభిషేక్‌ బచ్చన్‌ - ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబేరాయ్‌ తన తండ్రి సురేష్‌ ఒబేరాయ్‌ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జుహులోని గాంధీగ్రామ్‌ పాఠశాలలో వారు ఓటు వేశారు.

యంగ్ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజయ్‌ దేవ్‌ గణ్‌ - కాజల్‌ దంపతులు - అనుపమ్‌ ఖేర్‌ - ప్రియాదత్‌ గేయ రచయిత గుల్జర్‌ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాగ్య శ్రీ, సోనాలీ బింద్రే ముంబైలోని విలే పార్లేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌ రావ్‌ ముంబై బాంద్రాలోని అన్నెస్‌ హైస్కూల్‌ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ జుహులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్‌ డీఎఫ్‌ సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పెద్దర్‌ రోడ్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్‌ నటి రేఖ బాంద్రాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్ పెద్దర్‌ రోడ్‌ లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మొత్తంగా నాలుగో ద‌శ‌లో తార‌లు - పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు రావ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇక నాలుగో విడ‌త‌లో ఏఏ రాష్ట్రాల్లో ఎంత‌మేర పోలింగ్ న‌మోదైంద‌న్న విష‌యానికి వ‌స్తే... బీహార్ లో44.33 శాతం - ఝార్ఖండ్ లో 57.13 శాతం - ఉత్తరప్రదేశ్ లో53.23 శాతం - ఒడిశాలో 53.61 శాతం - మహారాష్ట్రలో 42.52 శాతం - మధ్యప్రదేశ్ లో57.77 శాతం - రాజస్థాన్ లో 54.75 శాతం - పశ్చిమ బెంగాల్ లో 66.46 శాతం - జమ్మూకశ్మీర్ లో 9.37 శాతం న‌మోదైంది. మూడో ద‌శ‌లో క‌నీసం 12 శాతం పోలింగ్ శాతం న‌మోదైన కాశ్మీర్ లో నాలుగో విడ‌త‌లో కేవ‌లం 9.37 శాతం పోలింగ్ న‌మోదు కావడం గ‌మ‌నార్హం. ఇక ఈ ద‌శ‌లో అన్సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ - కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ 199లోకి ప్రవేశించడమే కాకుండా పోలింగ్‌ ఏజంట్‌ - బూత్‌ లో ఉన్న ఎన్నికల అధికారిని బెదిరించార‌నే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.