Begin typing your search above and press return to search.

ఏపీ పోలింగ్ లో లేటెస్ట్ ఫిగర్స్.. ఏ జిల్లాలో ఎంతంటే?

By:  Tupaki Desk   |   12 April 2019 6:42 AM GMT
ఏపీ పోలింగ్ లో లేటెస్ట్ ఫిగర్స్.. ఏ జిల్లాలో ఎంతంటే?
X
ఏపీలో పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకూ సాగిన పోలింగ్ కు సంబంధించి ఎంత శాతం ఓట్లు పోల్ అయ్యాయి? అత్యధికంగా ఓట్లు పోలైన జిల్లా ఏది? అత్యల్పంగా ఓట్లు పోలైన జిల్లా ఏమిటి? జిల్లాల వారీగా ఎక్కడ ఎంత మేర పోల్ అయ్యాయి? అన్న ప్రశ్నలకు సమాధానం లభించినట్లే.

గంటల తరబడి సాగిన ఏపీ పోలింగ్ మీద ఏపీ ఎన్నికల సంఘం అధికారి అంచనాలు తప్పు అయ్యాయి. ద్వివేది చెప్పిన దాని ప్రకారం 80 శాతానికి మించి పోలింగ్ జరుగుతుందని చెప్పటం.. దీనికి తోడు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల పోలింగ్ జరిగి.. ఓట్లు వేసేందుకు గంటల తరబడి ఓపిగ్గా వెయిట్ చేయటం తెలిసిందే. అయితే.. ఇంత హడావుడి చేసిన తర్వాత కూడా పోల్ అయిన మొత్తం ఓట్లు 77 శాతానికి మించని పరిస్థితి.

ద్వివేది స్వయంగా చెప్పినట్లుగా 80 శాతానికి కూడా పోలింగ్ చేరుకోలేదు. ఏపీ ఎన్నికల సంఘం అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 76.79 శాతం మాత్రమే పోలైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి కొంతమేర పోలింగ్ శాతం తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఈవీఎంల మొరాయింపు.. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం లాంటి కారణాలతో పాటు.. గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం కూడా పోలింగ్ ఈ మాత్రమే నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో పలువురు.. పోలింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఓటు వేయకుండానే వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లోనూ.. ఘర్షణలుచోటు చేసుకున్న చోట రీపోలింగ్ కు అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తంగా నమోదైన పోలింగ్ చూస్తే.. అత్యధికంగా ప్రకాశం.. విజయనగరం జిల్లాలు మొదటివరుసలో నిలిచాయి. ఈ రెండు జిల్లాల్లో 85 శాతం ఓట్లు పోల్ కావటం గమనార్హం. విశాఖపట్నం.. పశ్చిమగోదావరి.. కడపలలో అత్యల్పంగా 70 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావటం విశేషం.

జిల్లాల వారీగా పోలింగ్ చూస్తే..

శ్రీకాకుళం: 72 శాతం
విజయనగరం: 85 శాతం
విశాఖపట్నం: 70 శాతం
తూర్పు గోదావరి: 81 శాతం
పశ్చిమ గోదావరి: 70 శాతం
కృష్ణా: 79 శాతం
గుంటూరు: 80 శాతం
ప్రకాశం: 85 శాతం
నెల్లూరు: 75 శాతం
కర్నూలు: 73 శాతం
కడప: 70 శాతం
అనంతపురం: 78 శాతం
చిత్తూరు: 79 శాతం