Begin typing your search above and press return to search.

దుబ్బాక దంగల్: కొనసాగుతున్న పోలింగ్

By:  Tupaki Desk   |   3 Nov 2020 4:00 AM GMT
దుబ్బాక దంగల్: కొనసాగుతున్న పోలింగ్
X
తెలంగాణలో హీట్ పెంచిన దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు చేరుకొని ఓట్లు వేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి శానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేశారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. మందులను అందుబాటులో ఉంచారు. దుబ్బాక నియోజకవర్గంలో రేపు 315 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కరోనా కారణంగా సాయంత్రం సమయాన్ని పెంచారు. ఈనెల 10 ఫలితం వెలువడనుంది.

*టఫ్ ఫైట్
దుబ్బాకలో పార్టీల బలాబలాలను చూస్తే టీఆర్ఎస్ తరుఫున హరీష్ బలంగా కొట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత గెలుపుకోసం శాయశక్తులు ఒడ్డుతున్నాడు. ఇక కేంద్రంలోని అండతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొట్లాడుతున్నారు. కానీ అధికారబలంతో టీఆర్ఎస్ ఇక్కడ బీజేపీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక మధ్యలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దిగ్గజ నేతలను మోహరించి వారి ప్రచారం వారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్నది ఉత్కంఠగా మారింది. రేపు పోలింగ్ తర్వాత వేవ్ తెలియనుంది.

*నియోజకవర్గ స్వరూపం ఇదీ..
దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయిపోల్ ఉండగా.. మెదక్ జిల్లా పరిధిలోని నార్సింగ్, చేగుంట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గంలో మొత్తం 1,98, 807 ఓట్లు ఉన్నాయి. వీరిలో లక్షా 779 మంది మహిళలు కాగా.. 98 వేల 28 మంది పురుషుల ఓట్లు ఉన్నాయి. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం 8 వేల ఓట్లు పెరిగాయి. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 2009 లో ఏర్పడ్డ దుబ్బాక నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.ఆ సంవత్సరంలో మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ సీటు దక్కించుకుంది. అయితే అప్పటి వరకు టీడీపీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో ఆయన గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ కు 89వేల 299, కాంగ్రెస్ కు 26 వేల 799, బీజేపీకి 22 వేల 595 ఓట్లు వచ్చాయి.

*మోహరించిన పోలీసులు..
దుబ్బాక ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు దుబ్బాకలోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు.

*ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి
దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 10 గంటల వరకు దుబ్బాక పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎక్కడా చెదురు ముదురు ఘటనలు చోటుచేసుకోలేదు.