Begin typing your search above and press return to search.

కర్ణాటక లో ప్రారంభమైన పోలింగ్ .. సర్కార్ నిలవాలంటే 7 గెలవాల్సిందే ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:45 AM GMT
కర్ణాటక లో ప్రారంభమైన పోలింగ్ .. సర్కార్ నిలవాలంటే 7 గెలవాల్సిందే ?
X
తాజాగా కొద్ది సేపటి క్రితం కర్ణాటక లో ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలందరూ తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్దకి తరలి వస్తున్నారు. ప్రజలు భారీ ఎత్తున తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తుండటం తో పోలీసులు ఎటువంటి ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు. ప్రస్తుతం కర్ణాటక లో బీజేపీ అధికారంలో ఉంది. గత కొన్ని రోజుల వరకు కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటక లో అధికారంలో ఉన్నప్పటికీ 17 మంది తిరుగుబాటు చేసి బీజేపీ కి మద్దతు తెలపడంతో .. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వల్ల , ఆ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారందరూ బీజేపీ లో చేరారు. ఇకపోతే మొత్తం 17 మంది తిరుగుబాటు చేయగా ..ప్రస్తుతం 15 చోట్ల ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. బెంగళూరు సిటీ పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్ రాజరాజేశ్వరి నగర తో పాటు మస్కిలల్లో ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. 9వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈ ఉప ఎన్నికల కోసం అధికారులు మొత్తం 4,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో 461, అత్యల్పంగా శివాజీ నగర పరిధిలో 193 పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం ఏడు స్థానాలలో విజయం సాధించాల్సి ఉంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సభ్యుల సంఖ్య 112కు చేరుతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటేనే యడియూరప్ప సర్కార్ నిలబడుతుంది. ఆలా కానీ పక్షంలో మళ్లీ కాంగ్రెస్-జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.