Begin typing your search above and press return to search.

ఆ అభ్య‌ర్థుల‌కు ఓట్ల సునామీ

By:  Tupaki Desk   |   13 Dec 2018 4:32 AM GMT
ఆ అభ్య‌ర్థుల‌కు ఓట్ల సునామీ
X
మ‌హాకూట‌మి విజ‌యం కోసం రాహుల్ రోడ్ షోలు చేశాడు. చంద్ర‌బాబు కాళ్ల‌కు బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగాడు. బాల‌కృష్ణ తొడ‌గొట్టాడు. రేవంత్ రెడ్డి మీసం మెలేసాడు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గ‌డ్డానికి క‌ల‌ర్ వేసుకుని మ‌రీ ప్ర‌మాణ స్వీకారానికి రెడీ అయ్యాడు. బీజేపీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప‌ర్య‌టించాడు. కేంద్ర‌మంత్రులు దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో స‌భ‌లు పెట్టారు. టీఆర్ ఎస్ పార్టీ నుండి ఒక్క కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా స‌భ‌లు పెట్టారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నాలుగున్న‌రేళ్ల‌లో ఏం చేసింది - అవ‌కాశం ఇస్తే రాబోయే రోజుల్లో ఏం చేసేది వివ‌రించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ - టీడీపీల పాల‌న‌ను చూసిన తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ వైపే మొగ్గుచూపారు. మ‌హాకూట‌మి ఆశ‌ల‌ను అడియాశ‌లు చేశారు. కేసీఆర్ ఛ‌రీష్మా ముందు కాంగ్రెస్ - బీజేపీలు వెల‌వెలబోయాయి.

ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన ఓట్లు సునామీని త‌ల‌పించాయి. రాష్ట్రంలోని వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ల‌క్ష‌కు పై చిలుకు ఓట్లు సాధించిన అభ్య‌ర్థుల వివ‌రాలు ఒకసారి ప‌రిశీలిస్తే అత్య‌ధిక మెజార్టీతో పాటు అత్య‌ధికంగా ల‌క్షా 31 వేల 295 ఓట్లు సాధించి ల‌క్ష‌కు పైగా ఓట్లు సాధించిన వారి జాబితాలో హ‌రీష్ రావు నిలిచారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న బావ‌మ‌రిది - కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు కూడా ల‌క్షా 25 వేల 213 ఓట్లు వ‌చ్చాయి. 89 వేల 9 ఓట్ల మెజార్టీ రావ‌డం విశేషం. వ‌న‌ప‌ర్తి అభ్య‌ర్థి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ల‌క్షా 11 వేల 956 ఓట్లు సాధించి ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల‌లో అత్య‌ధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక్క‌డ ఆయ‌న‌కు 51 వేల 956 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. జిల్లాల వారీగా చూస్తే వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట‌లో ఆరూరి ర‌మేష్ ల‌క్షా 31 వేల 252 ఓట్లు సాధించి 99 వేల మెజార్టీ సాధించారు. అయితే అక్క‌డ మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీజేఎస్ కేటాయించ‌డంతో ఆయ‌న నెత్తిన పాలుపోసిన‌ట్లయింది.

ఇక హైద‌రాబాద్ లోని నియోజ‌క‌వ‌ర్గాల‌లో భారీగా ఓట‌ర్లున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే ఇక్క‌డ కుత్భుల్లాపూర్ లో కేపీ వివేకానంద ల‌క్షా 54 వేల 500 - మైనంప‌ల్లి హ‌నుమంత్ రావు ల‌క్షా 14 వేల 149 - సీహెచ్ మ‌ల్లారెడ్డి ల‌క్షా 67 వేల 324 ఓట్లు సాధించారు. అత్య‌ధిక ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు కాబ‌ట్టి వీరు అత్య‌ధిక ఓట్లు సాధించ‌గ‌లిగారు. గ్రామీణ ప్రాంతాల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ల‌క్ష పై చిలుకు ఓట్లు రావ‌డం కేసీఆర్ ప‌ట్ల‌ - టీఆర్ ఎస్ ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌లో ఉన్న ఆద‌ర‌ణ తేట‌తెల్ల‌మ‌యింది. మొద‌టినుండి కేసీఆర్ చెబుతున్న‌ట్లుగా 119 స్థానాల‌కు గాను 88 స్థానాలు సాధించడం మామూలు విష‌యం కాదు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అంచ‌నా వేయ‌డంలో అన్ని విఫ‌ల‌మ‌య్యాయి అన్న‌ది ఈ ఎన్నిక‌ల‌తో తేలిపోయింది.