Begin typing your search above and press return to search.

కాలుష్య నియంత్రణ.. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
కాలుష్య నియంత్రణ.. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య భూతం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం టాప్‌ టెన్‌ నగరాల్లో ఏడు మనదేశంలో ఉన్నాయి. అందులో ఢిల్లీ కూడా ఒకటి కావడం గమనార్హం. అంతకంతకూ దిగజారుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి గతంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం వాహనాలు రోడ్లపైకి రావడంలో సరి–బేసి సంఖ్యను అనుసరించిన సంగతి తెలిసిందే.

ఈ విధానంతో అప్పట్లో కొంతమేర వాయు కాలుష్యం తగ్గింది. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వాయ కాలుష్యానికి కారణమవుతున్న భవన నిర్మాణ పనుల్ని నిలిపేయాలని నిర్ణయించింది.

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా భవన నిర్మాణ పనుల్ని నిలిపేస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కూడా అయిన మనీష్‌ సిసోడియాను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయంతో ఢిల్లీలో నిర్మాణ పనులు నిలిచిపోనున్నాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు తమకు ఉపాధి ఉండదని ఆందోళన చెందుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి కోల్పోయే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. భవన నిర్మాణాలపై నిషేధం ఉన్నంతకాలం కార్మికులు నెలకు రూ.5 వేల సాయం పొందొచ్చు. ఈ మేరకు అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. తిరిగి భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ట్వీట్‌లో తెలిపారు.

మరోవైపు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఉద్యోగులకు ఒక సూచన చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు కంపెనీలు ఒప్పుకుంటే ఇంట్లో ఉండే పని చేసుకోవాలని కోరారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంలో ప్రైవేటు వాహనాలు వెదజల్లే కాలుష్యం 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటే వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదన్నారు. పబ్లిక్‌ రవాణా వాహనాలు తప్ప ప్రైవేటు వెహికల్స్‌ తగ్గిపోతాయన్నారు. తద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.