Begin typing your search above and press return to search.

ఢిల్లీకి ప‌ట్టిన గ‌తే.. తెలుగు రాష్ట్రాలకూ ప‌డుతుందా?

By:  Tupaki Desk   |   13 Nov 2021 2:55 PM GMT
ఢిల్లీకి ప‌ట్టిన గ‌తే.. తెలుగు రాష్ట్రాలకూ ప‌డుతుందా?
X
దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి ప‌ట్టిన గ‌తే.. మున్ముందు.. ఏపీ తెలంగాణ‌లకు ప‌డుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఢిల్లీ మ‌రోసారి మూత‌బ‌డ‌డ‌మే. ఇటీవ‌ల క‌రోనా స‌మ‌యంలో అన్ని రాష్ట్రాల‌తో పాటు.. ఇక్క‌డ కూడా క‌రోనా కేసులు పెరిగిపోవ‌డంతో లాక్‌డౌన్ విధించారు. దాదాపు నాలుగు నెల‌ల పాటు.. ఇక్క‌డ సాధార‌ణ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయంది. అయితే.. అది క‌రోనా స‌మ‌యం క‌నుక‌.. అన్ని వ‌ర్గాలు భ‌రించాయి. కానీ, ఇప్పుడు.. మ‌రోసారి.. రాజ‌ధాని మూత దిశ‌గా అడుగులు వేస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఏకంగా.. వారం రోజుల పాటు.. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించేందుకు అక్క‌డి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది.

ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌.. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇళ్ల నుంచి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించన్నారు. భవన నిర్మాణ కార్యకలాపాలు కూడా నవంబర్ 14-17 వరకు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? క‌రోనా ఏమైనా.. విజృంభించే సంకేతాలు ఉన్నాయా? అంటే.. అవేవీ లేదు.

కానీ, అంతకుమించి! అన్న‌ట్టుగా.. ఢిల్లీలో ప‌రిస్థితి చేతులు దాటుతోంది. ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. క‌నీసం.. రోడ్ల‌పై న‌డిచే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. లాక్డౌన్ విధించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కేజ్రీవాల్ ప్ర‌భుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాయునాణ్యత సూచి 499కి చేరినందున త్వరితగతిన చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసి వేస్తే పిల్లలు విషవాయువును పీల్చే ముప్పు ఉండదని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

ఎడా పెడా పెరిగిపోయిన వాహ‌నాల‌తో నిత్యం కాలుష్య కాసారంగా న‌గ‌రం త‌యారైంది. ఇక‌, పంట వ్యర్ధాల దహనంతో ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గత కొంత కాలంగా క్షీణించిన వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్ధాయికి చేరింది. ప్ర‌స్తుతం వాయు నాణ్యత సూచీ 473గా నమోదైంది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న నోయిడాలో ఇది 587గా నమోదు కాగా, గురుగ్రామ్‌లో 557గా నమోదైంది. వాయు నాణ్యత సూచీ సున్నా నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యంగా ఉన్నట్లు, 401 నుంచి 500 ఉంటే పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌ధాని వ‌చ్చే వారం రోజులు మూత‌బ‌డ‌నుంది.

అయితే.. ఇది ఇప్పుడు.. ఢిల్లీకే ప‌రిమిత‌మైనా.. మున్ముందు.. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా.. మ‌రిన్ని రాష్ట్రాలకూ ముప్పు ఉంద‌ని.. నిపుణులు చెబుతున్నారు. క‌ర్బ‌న ఉద్గారాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప‌రిస్థితిని వారు గుర్తు చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. మ‌న ప్ర‌భుత్వాలు మేల్కొంటాయా? చూడాలి!!