Begin typing your search above and press return to search.

ఏపీలో అధికారంపై కన్నేసిన భాజపా!

By:  Tupaki Desk   |   12 Sep 2015 4:32 AM GMT
ఏపీలో అధికారంపై కన్నేసిన భాజపా!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ దెబ్బతిన్న తర్వాత.. రాజకీయ శూన్యత ఉంది. ఆ గ్యాప్‌ ను మేం భర్తీ చేస్తాం. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో కొంత పటిష్టమైన కేడర్‌ మద్దతు ఉంది. పార్టీ రాష్ట్ర వ్యాప్త విస్తరణకు ఇది చాలా ఉపయోగపడుతుంది.. వంటి డైలాగులు భారతీయ జనతా పార్టీ గత ఏడాదిగా వల్లిస్తూ ఉంటే ఎవ్వరూ పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. అయితే ఒక్కొక్క పరిణామాన్ని గమనిస్తోంటే తెదేపాను ఇరుకున పెట్టడానికి, భాజపాను బలోపేతం చేయడానికి ఉద్దేశించినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా విషయంలో మొండిచెయ్యి. కనీసం ప్రత్యేకప్యాకేజీ ఎంత ఏంటి? అనే సంగతి తెలుగుదేశం నాయకులు ఏమీ చెప్పలేకపోతుండగా.. భాజపాకు చెందిన పురందేశ్వరి 63 వేల కోట్లు ఇవ్వబోతున్నారంటూ ఎగ్జాక్ట్‌ లెక్కలు చెప్పగలగడం ఇలాంటి పరిణామాలన్నీ భాజపా వ్యూహం గురించి అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. తాజాగా విజయవాడలో జరిగిన ఒక పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే ఏపీలో అధికారం చేపట్టబోతున్నదని వ్యాఖ్యానించడం ఇలాంటి అనుమానాలకు పరాకాష్ట.

తెలుగుదేశం, భాజపా మిత్రపక్షాలే. కానీ వీరి మైత్రీ బంధం అనేది.. ఇరువురికీ గత్యంతరం లేక బలవంతంగా కొనసాగుతున్న బంధంలాగానే ఉన్నది. అసలు తెలంగాణలో అయితే.. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలు అనే సంగతిని ఎవరైనా చెబితే తప్ప కనుక్కోవడం చాలా కష్టం. ఎవరికి వారే అన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. ఏపీలో ప్రభుత్వంలో భాజపా కూడా భాగస్వామి గనుక.. కాస్త కలసి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. లోలోపల ఎవరికి వారు తమ పార్టీ స్వతంత్రంగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తే ఎలా అనే సన్నాహాల్లోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

విజయవాడ సమావేశంలో కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ,... 2019లో మనకే అధికారం దక్కుతుందని అన్నారు. ఈ సభలో కంభంపాటి హరిబాబు, పురందేశ్వరి తదితరులంతా ఉన్నారు. మొత్తానికి సొంత ఎన్నికలు, సొంతంగా ప్రభుత్వం అనే ఆలోచన భాజపాకు ఉన్నది..

అంటే దాని అర్థం.. అది ఏనాటికైనా తెలుగుదేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందనే. అంటే చంద్రబాబు తన సహజవ్యూహాల పరంగా అయితే.. వారిని మట్టుపెట్టడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేయాలి. కానీ తన ప్రభుత్వ మనుగడకే ప్రతి చిన్నవిషయానికీ కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ.. వారిని ఒక మాట అనడానికీ గట్టిగా అడగడానికీ కూడా జంకుతూ, భయపడుతూ ఉన్న చంద్రబాబు.. ఇక వారి పార్టీని దెబ్బతీయడానికి వ్యూహాలు పన్నగల స్థితిలో ఉన్నారా అనేది అనుమానమే.