Begin typing your search above and press return to search.

అధికార పార్టీలో చిచ్చుపెట్టిన ఫ్లెక్సీల రగడ

By:  Tupaki Desk   |   28 Oct 2020 4:30 PM GMT
అధికార పార్టీలో చిచ్చుపెట్టిన ఫ్లెక్సీల రగడ
X
దసరా.. ఆ మరునాడు సోమవారం సెలవు. అదే రోజు అప్పుడే మాజీ ఎంపీ బర్త్ డే. దీంతో ఆయన అనచరులు ఉత్సాహంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెలవు రోజున మున్సిపల్ కమిషనర్ అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద సమావేశమై ఫ్లెక్సీలు కట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. కట్టిన ఫ్లెక్సీలను చించేసి తొలగించడం వివాదానికి కారణమైందట... దీంతో ఇప్పుడు ఈ ఫ్లెక్సీల రగడ అధికార పార్టీలో చిచ్చు పెట్టిందన్న చర్చ ఖమ్మంలో సాగుతోంది.

ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటు చిచ్చుపెట్టింది. పొంగులేటి మళ్లీ ఖమ్మంలో యాక్టివ్ అయ్యారు. సోమవారం ఆయన బర్త్ డే రావడంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుచరులు ప్లాన్ చేశారు. ఖమ్మం నగరాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక విజయదశమి పండుగ సందర్భంగా మంత్రి అజయ్ ఫ్లెక్సీలతో కూడా ఖమ్మం నగరం కళకళలాడింది.

అయితే అధికారుల ఆదేశాలతో కార్పొరేషన్ సిబ్బంది నగరంలోని పొంగులేటి ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. అక్కడక్కడ మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలను వదిలిపెట్టి మిగిలిన వాటిని.. పొంగులేటి ఫ్లెక్సీలను చించడంతో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి.

సెలవు రోజు కమిషనర్, మున్సిపల్ సమావేశం పెట్టి మరీ ఈ చర్య తీసుకోవడం ఏంటని పొంగులేటి అనుచరులు మండిపడుతున్నారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు లేవని.. అనుమతి తీసుకున్న వారివి ఉంచి మిగతా వాటిని తీసేశామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మొత్తం మీద ఇప్పుడు అధికార పార్టీలో ఫ్లెక్సీల ఏర్పాటు చిచ్చు రేపింది.