Begin typing your search above and press return to search.

ఎంపీ సీటు వద్దంటూ.. పొంగులేటి పయనమెటు?

By:  Tupaki Desk   |   19 May 2022 4:30 PM GMT
ఎంపీ సీటు వద్దంటూ.. పొంగులేటి పయనమెటు?
X
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ప్రత్యేక స్థానం. అనూహ్యంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. 2014 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎంపీగా గెలుపొందారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఖమ్మం నియోజకవర్గంలో.. అది కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరిని, టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావును ఎదుర్కొంటూ.. వైసీపీ తరఫున ఎంపీగా నెగ్గడం అంటే మామాలు మాటలు కాదు.

అయితే అనంతరం పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీలోనూ సముచిత గౌరవమే దక్కినా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ఒక్క సీటుకే పరిమితం కావడంతో ప్రభావం పడింది. నాటి ఎన్నికల నాటికి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో సరిపడకపోవడం.. తుమ్మల సహా పలువురు అభ్యర్థులు ఓడిపోవడం దెబ్బకొట్టింది. దీనికి ఖమ్మం జిల్లాలోని వర్గ విభేదాలే కారణమని భావించి టీఆర్ఎస్ అధిష్ఠానం అటు పొంగులేటి ఇటు తుమ్మల ఇద్దరినీ దూరం పెట్టింది.

ఈయనకు టికెట్ లేదు.. ఆయనకు పదవి లేదు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ అధిష్ఠానం గుర్రుగా ఉంటూ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్ ఇవ్వలేదు. అనూహ్యంగా నామా నాగేశ్వరరావును తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల అనంతరం ఆ పని చేయలేదు. రాజకీయంగా ప్రాధాన్యం దక్కలేదు. అప్పటినుంచి వీరికి పదవుల్లేవు. మధ్యలో పొంగులేటికి ఎమ్మెల్సీ ఇస్తామన్నా.. అదీ సాకారం కాలేదు.

ఎంపీ వద్దన్నారు

ప్రస్తుతం తెలంగాణలో మూడు రాజ్య సభ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడూ టీఆర్ఎస్ కే దక్కుతాయి. వీటిలో ఒకదానిని ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్ఠానం చెప్పింది. కానీ, ఆయన దీనిని తిరస్కరించారు. అయితే, ఇక్కడో తిరకాసు ఉంది. ఐదేళ్ల పదవీ కాలం ఉన్న.. డి.శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావు విరమణతో ఖాళీ అవుతున్న స్థానాలు కాకుండా..
రెండేళ్లు పదవీ కాలం ఉన్న బండా ప్రకాశ్ (ఎమ్మెల్సీ) సీటును పొంగులేటికి ఆఫర్ చేసినట్లు సమాచారం. పూర్తి స్థాయి పదవీ కాలం కానప్పుడు స్వీకరించడం అనవసరమని భావించి పొంగులేటి వద్దనట్లు కనిపిస్తోంది. కేవలం రెండేళ్ల కోసం పదవి తీసుకుంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలకు టికెట్ అడగడం వీలుకాదనే భావనతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష రాజకీయాలకే మొగ్గు?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎటువంటి అవకాశమూ లేని పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగారు. మాస్ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. సొంత ఇమేజ్ తో గెలిచారు. కీలక సందర్భంలో జరిగిన తప్పిదం కారణంగా పదవులకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజా క్షేత్రంలోనూ తేల్చుకుందామనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఆయన టీఆర్ఎస్
లో కొనసాగుతూనే ఈ పని చేస్తారా..? లేదా? అనేది చూడాలి.