Begin typing your search above and press return to search.

కారు దిగి...కమలం గూటికి చేరనున్న పొంగులేటి..?

By:  Tupaki Desk   |   9 Aug 2019 7:56 AM GMT
కారు దిగి...కమలం గూటికి చేరనున్న పొంగులేటి..?
X
పొంగులేటి శ్రీనివాసరెడ్డి... టీఆర్ ఎస్ పార్టీలో సీనియర్ నేత. మొన్నటి ఎన్నికల ముందు వరకు ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. అయితే ఎన్నికలయ్యాక ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. మెల్ల మెల్లగా ఆయన టీఆర్ ఎస్ కి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో తనకి తగిన గుర్తింపు ఉండట్లేదని భావిస్తున్న పొంగులేటి త్వరలో టీఆర్ ఎస్‌ ని వీడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి పొంగులేటి, అప్పుడు టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు.

అయితే రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం - వైసీపీ ఏపీకే పరిమితం కావడంతో ఆయన గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి టీఆర్ ఎస్ లో చురుకుగా పని చేస్తూ వచ్చారు. ఇక 2018 చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజారిటీ సాధించిన ఖమ్మం జిల్లాలో కేవలం ఒక సీటే గెలుచుకుంది. దీనికి ఎక్కువ కారణం పొంగులేటి అని నమ్మిన టీఆర్ ఎస్ అధిష్టానం - ఆయనకి లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం సీటు ఇవ్వలేదు. అప్పటికప్పుడు టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకి సీటు ఇచ్చారు.

ఆ ఎన్నిక‌ల్లో పొంగులేటికి ఎంపీ సీటు ద‌క్క‌క‌పోవ‌డానికి జిల్లా టీఆర్ ఎస్ నాయ‌కులు కేసీఆర్‌ కు కంప్లైంట్ చేయ‌డంతో పాటు జిల్లాలో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కూడా కొంత వ‌ర‌కు కార‌ణం. దీంతో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి పార్టీకి మరింత దూరమయ్యారు. పైగా ఖమ్మంలో సీనియర్ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్ ఏదొక కీలక పదవి ఇచ్చేందుకు చూస్తున్నారు. ఒకవైపు నామా - మరోవైపు తుమ్మల జిల్లాపై పట్టు సాధించేందుకు చూస్తున్నారు.

టీఆర్ ఎస్ కూడా వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. పైగా వారు కమ్మ సామాజికవర్గం నేతలు. జిల్లాలో కూడా కమ్మ నేతల ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణ‌లో మిగిలిన జిల్లాల్లో రెడ్లకు ప్ర‌యార్టీ ఇవ్వాల్సి ఉండ‌డంతో ఖ‌మ్మంలో క‌మ్మ‌ల‌కే ప్ర‌యార్టీ ఇవ్వాలి. దీంతో పొంగులేటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి సైలెంట్ అయిపోయారు.

ఇక ప్ర‌యార్టీ లేని చోట ఉండకూడదని ఫిక్స్ అయిన ఆయన ఇటీవల బీజేపీ పెద్దలని కూడా కలుసుకుని పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నాన‌ని సంకేతాలు ఇచ్చిన‌ట్టు సమాచారం. అటు బీజేపీ కూడా తెలంగాణలో బలపడేందుకు చూస్తుంది. అందుకే ఇలాంటి బలమైన నాయకుడ్ని చేర్చుకుంటే పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని కాషాయ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన కారు దిగి - కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.