Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తుకు జైపాల్ సై...పొంగులేటి నై

By:  Tupaki Desk   |   25 May 2017 1:24 PM GMT
టీడీపీతో పొత్తుకు జైపాల్ సై...పొంగులేటి నై
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న తెలంగాణ‌లో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్‌ - బీజేపీ శ్రేణుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర‌ విమ‌ర్శ‌లకు కేంద్రంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే ప‌ర్య‌ట‌న ఇప్పుడు కాంగ్రెస్‌ లోని లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెడుతోంది. అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ‌లో టీడీపీతో పొత్తుపై పున‌ర్ ఆలోచిస్తామ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము సైతం బీజేపీతో దోస్తీ విష‌యంలో అంత ఆస‌క్తిగా ఏమీ లేమ‌ని, అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్‌ తో ముందుకు సాగుతామ‌ని తెలిపారు.

రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై రేవంత్ రెడ్డి కామెంట్ల నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత - కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి చాలా సానుకూలంగా రియాక్ట‌య్యారు. టీఆర్‌ ఎస్‌ - బీజేపీ తప్ప అన్ని పార్టీలతో అనుకూలంగా ఉంటామని జైపాల్ రెడ్డి తెలిపారు. టీడీపీతో పొత్తుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ పార్టీ నిర్ణయాన్ని బట్టే తమ నిర్ణయం చెబుతామని జైపాల్‌ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక అమిత్ షా ప‌ర్య‌ట‌న గురించి ప్ర‌స్తావిస్తూ తెలంగాణకు వచ్చిన నిధులన్నీ రాజ్యాంగ బద్ధంగా, చట్టప్రకారం వచ్చినవేనని, అమిత్‌ షా చెప్పినవన్నీ కాకి లెక్కలని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటనతో ఫ‌లితం శూన్యమన్న విషయం తనకుముందే తెలుసునని జైపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, మోడీతో స్నేహం..అమిత్‌ షాతో వైరం అనే విధానాన్ని చూస్తుంటే ఇది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లా కనబడుతోందని, బీజేపీతో కేసీఆర్‌ కు రహస్య అజెండా ఉందని వ్యాఖ్యానించారు.

కాగా, కేంద్ర మాజీమంత్రి జైపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఘాటుగా రియాక్ట‌య్యారు. టీడీపీతో పొత్తుకు సై అన్న జైపాల్‌ వ్యాఖ్యలను ఖండించిన పొంగులేటి...ఎన్నిక‌ల్లో పొత్తుపై మాట్లాడే అధికారం జైపాల్‌ రెడ్డికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పుడు పొత్తులెందుకని ప్ర‌శ్నించారు. జైపాల్‌ రెడ్డి మాటలు అప్రస్తుతమని, పొత్తులు పార్టీ విధాన నిర్ణయం ప్రకారం ఉంటాయన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచేలా చేసిన జైపాల్‌ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో భాగస్వామిగా ఉన్న టీడీపీతో పొత్తు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉండి నాయ‌కులు మాట్లాడుతున్నారా లేక ఎవ‌రి ఎజెండా వారిదేనా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/