Begin typing your search above and press return to search.

రేవంత్ అలా చెప్పి కాంగ్రెస్‌ లో చేరాలి: పొంగులేటి

By:  Tupaki Desk   |   22 Oct 2017 8:47 AM GMT
రేవంత్ అలా చెప్పి కాంగ్రెస్‌ లో చేరాలి: పొంగులేటి
X
రేపో మాపో కాంగ్రెస్‌ లోకి చేర‌తాడ‌ని మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న తెలంగాణ టీడీపీ నేత‌ - కొడంగ‌ల్ ఎమ్మెల్యేకు నిన్న‌మొన్న‌టి దాకా కాంగ్రెస్ సీనియ‌ర్లు అడ్డు చెబుతున్న‌ట్టు క‌నిపించారు. ముఖ్యంగా మాజీ మంత్రి - గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం చెప్ప‌డం మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఎలాగూ టీడీపీ నుంచి వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌ని భావించిన రేవంత్ రెండు రోజులుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంటికీ వెళ్లి.. నేత‌లను బుజ్జ‌గిస్తున్నారు. డీకే అరుణ‌ను కూడా ఆయ‌న ఇలానే బుజ్జ‌గించారు. దీంతో ఆమె మీడియా ముందుకువ‌చ్చి రేవంత్ కాంగ్రెస్‌ లోకి రావ‌డం వ‌ల్ల త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రమూ లేద‌ని చెప్పుకొచ్చారు. పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా ఆహ్వానిస్తామ‌ని చెప్పారు.

ఇక‌, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ లో ఫైర్ బ్రాండ్‌.. పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి కూడా రేవంత్ రాక‌ను ఆహ్వానిస్తూనే ఆయ‌న‌కు త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు. గతంలో రాజీవ్‌ గాంధీని ఉరితీయాలని మాట్లాడినవాళ్లు కూడా తర్వాతి కాలంలో పార్టీలో చేరి ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌ లో ఉందని ఆయ‌న అన్నారు. అయితే, కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశానుసారం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లోకి వస్తే రావచ్చునని, దీనికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌ర‌మూ ఉండ‌బోద‌ని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌ హాలులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విలేకరులు రేవంత్ రాక‌పై పొంగులేటిని ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న ముందు సౌమ్యంగా స‌మాధానం చెబుతూనే అనాల్సిన మాటలు అనేయ‌డం గ‌మ‌నార్హం.

‘‘టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మా పార్టీలోకి వస్తున్నారని అధికారికంగా ఎవరూ చెప్పలేదు. పార్టీకి లాభం చేకూరేలా ఎవరు వచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అయితే, గతంలో పార్టీపై చేసిన విమర్శలకు చింతిస్తున్నామని చెప్పి ఆయ‌న వస్తే కార్యకర్తలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం. గతంలో రాజీవ్‌ గాంధీని ఉరితీయాలని మాట్లాడిన నేతలు కూడా పార్టీలో ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌ లో ఉంది’’ అని పొంగులేటి అన్నారు. అంటే.. రేవంత్ కాంగ్రెస్‌ లోకి రావాలంటే.. త‌ప్పుచేశాన‌ని చెప్పి రావాల‌నేది పొంగులేటి అభిప్రాయంగా ఉంద‌నేది స్ప‌ష్ట‌మైంది. మ‌రి రేవంత్ ఈ ష‌ర‌తుకు ఒప్పుకుంటాడా? అనేది వేచి చూడాలి. మ‌రో విష‌యం ఏంటంటే.. రేవంత్ ఎప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడో ఇంకా డేట్ క‌న్ఫ‌ర్మ్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.