Begin typing your search above and press return to search.

సీనియర్లకు 'చెయ్యి' స్తారా..!?

By:  Tupaki Desk   |   16 Nov 2018 4:55 AM GMT
సీనియర్లకు చెయ్యి స్తారా..!?
X
కాంగ్రెస్ పార్టీ మూడున్నర దశాబ్దాలుగా ఉన్న వారికి గుర్తింపు లేదా....? అధిష్టానం వద్ద ఎవరు వొంగి వొంగి ఉంటే వారికి సలాములు చేస్తారా...? అంటూ పార్టీ సీనియర్ నాయకులు మండి పడుతున్నారు. ఒకరిద్దరు నాయకులు ఏకంగా రాహుల్ గాంధీతోనే ఈ మాటలన్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం కొందరు ఆశావహులతో పాటు సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య - పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమైనట్లు సమాచారం. ముందుగా ఈ సమావేశం ఒకరిద్దరు ఆశావహులకే కేటాయించినా... ఆ తర్వాత పొన్నాల - పొంగులేటి వంటి వారు కూడా వీరితో జత కలిసినట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన వీరి సమావేశం దాదాపు గంట వరకూ జరిగినట్లు చెబుతున్నారు. తొలుత రాహుల్ గాంధీ కొన్ని స్ధానాల్లో ఉన్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించినా ఆశావహుల్లో కొందరు " మీకు వాస్తవాలు తెలియవు. తెలంగాణలో కొందరు నాయకులు చెప్పిందే వింటున్నారు. నిజాలు తెలుసుకోండి " అని కాస్త గట్టిగానే చెప్పినట్లు సమాచారం. దీనిపై రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించి ముందు మీరు మాట్లాడండి అని ఆశావహులతో అన్నట్లు తెలిసింది. దీనిపై అందరూ తలో మాట కాకుండా ఒక్కరే మాట్లాడాలని సూచించాలని చెబుతున్నారు.

రాహుల్ గాంధీ చేసిన సూచనతో ఖమ్మం టిక్కట్ ఆశిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి కలుగజేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి వివరించినట్లు చెబుతున్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా తాను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నానని, ప్రతి ఎన్నికలకు ఏదో ఒక సాకుతో తనకు టిక్కట్ ఇవ్వడం లేదని ఆరోపించినట్లు చెబుతున్నారు. అలాగే నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్యను కాదని ఈ సారి జనగామ టిక్కట్ ను పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి కేటాయించడం దారుణమని అన్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతోను - తెలంగాణ జన సమితి నాయకులతోనూ మీరే మాట్లాడడండి అని పొంగులేటికి అప్పగించినట్లు చెబుతున్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతమైన కోపం కాని - వ్యతిరేకత కాని లేవని - స్ధానిక నాయకత్వం ఇచ్చిన నివేదికలతో పాటు ఏఐసీసీ పంపిన దూతల నివేదిక మేరకే వ్యవహరిస్తానని చెప్పినట్లు సమాచారం.