Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీది నీచ‌పు చ‌రిత్ర‌: కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   26 July 2022 10:42 AM GMT
ప్ర‌ధాని మోడీది నీచ‌పు చ‌రిత్ర‌: కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ వైర‌ల్!
X
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా పొన్నాల ల‌క్ష్మ‌య్య చ‌క్రం తిప్పారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఆ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగానూ పొన్నాల ప‌నిచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై అప్ప‌ట్లో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తేవారు. అయితే 2014, 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయాక పొన్నాల ల‌క్ష్మ‌య్య కాస్త నెమ్మ‌దించారు.

అయితే తాజాగా ఇప్పుడు మ‌రోమారు పొన్నాల యాక్టివ్ అయ్యారు. హైద‌రాబాద్ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీది నీచపు చరిత్ర అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కోలేక దేశవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను లాక్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నాల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మునుగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేర‌తార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో పొన్నాల ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే ఇటీవ‌ల గ‌తంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్లో చేసిన‌ట్టు ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలోనే పొన్నాల బీజేపీపై మండిప‌డ్డార‌ని అంటున్నారు.

దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పొన్నాల దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా, రాహుల్‌‌ గాంధీలపై ఈడీ విచారణ ఆ కుట్రలో భాగమేనని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీల ఆర్ధిక వ్యవహారాలపై కేసులు నమోదు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ప్రధాని మోదీ దుబారా ఖర్చులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ‘మోదీ... నీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది’ అంటూ పొన్నాల నిలదీశారు. ప్ర‌ధాని మోదీపై ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు ఇప్పుడు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.