Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ....ఆశ‌లు అడియాస‌లేనా?

By:  Tupaki Desk   |   18 Feb 2018 7:54 AM GMT
తెలంగాణ బీజేపీ....ఆశ‌లు అడియాస‌లేనా?
X
కేంద్రంలో అధికారంలో ఉండి..ద‌క్షిణాది రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక‌ దృష్టి సారించిన బీజేపీ పెద్ద‌ల‌కు తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి ఆశావ‌హంగా లేవ‌నే రాజ‌కీయ‌ చ‌ర్చ‌ను ఇప్పుడు విపక్షాలు సైతం అస్త్రంగా మ‌లుచుకుంటున్నాయి. ఏకంగా అస‌లు బీజేపీ తెలంగాణ శాఖ‌తో అవ‌స‌రం ఏముంద‌నే స్థాయికి ఈ చ‌ర్చ చేర‌డం గ‌మ‌నార్హం. పార్టీ బ‌లోపేతానికి ఢిల్లీ పెద్ద‌లు ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ...ఆచ‌ర‌ణ‌లో అవ‌న్నీ వైఫ‌ల్యం అవుతుండ‌టంతోనే ఇలా జ‌రుగుతోందని అంటున్నారు.

తెలంగాణలో బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కు వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అస‌లేమాత్రం పొంత‌న లేద‌ని అంటున్నారు. అధికార టీఆర్ ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు, వీలైనప్పుడ‌ల్లా ప్ర‌చారం చేస్తున్నారు. టీఆర్‌ ఎస్‌ - కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు పెద్ద నాయకులు తమతో టచ్‌ లో ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆపార్టీకే చెందిన ముఖ్యనేతలు వరుసగా షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి - ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌ లు రాజీనామాలు చేశారు. ఇటీవ‌లే జనగామ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఇప్పటి వరకు బీజేపీలోకి చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ ఇతర పార్టీల నుంచి చేరలేదు.

మ‌రోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా గత డిసెంబర్‌ లో రాష్ట్రానికి వస్తారని, ఆ సందర్భంగా భారీ ఎత్తున ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ పలుమార్లు ప్రకటించారు. దీనిపై వ్యక్తిగతంగా నివేదికలు తెప్పించుకున్న అమిత్‌ షా - రాష్ట్రంలో అంత సీన్‌ లేదని తెలుసుకొనే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.ఇక బీజేపీని అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌మ ప్ర‌త్య‌ర్థిగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా పీసీసీ ఉపాధ్య‌క్షుడు మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో బీజేపీ శాఖ అవ‌స‌ర‌మే లేదన్నారు. ఓ వైపు ఆ పార్టీ క్షీణిస్తుండ‌టం మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ ముఖ్య‌నేత‌లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో స‌ఖ్య‌త నెరుపుతున్న క్ర‌మంలో..తెలంగాణ బీజేపీ వ‌ల్ల ప్ర‌యోజనం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.