Begin typing your search above and press return to search.
పులి లాంటి కేసీఆర్ ను పిల్లిని చేసిన మోడీ
By: Tupaki Desk | 5 Feb 2018 11:03 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టర్మ్ లో ప్రవేశపెట్టిన చివరి పూర్తి బడ్జెట్ తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది. అటు ఏపీకి - ఇటు తెలంగాణకు మోడీ మొండిచేయి చూపించడంతో...అధికార టీడీపీ - టీఆర్ ఎస్ లు తీవ్రంగా ఇరకాటంలో పడ్డాయి. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అయితే అడ్డంగా బుక్ అయిపోయిన పరిస్థితి! ఇక అంశాల వారీ మద్దతు ఇస్తున్న తెలంగాణ పాలకపక్షమైన టీఆర్ ఎస్ పరిస్థితి కూడా ఈ విషయంలో అంత గొప్పగా ఏం లేదని విశ్లేషిస్తున్నారు. ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా కేంద్ర బడ్జెట్ ఆధారంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన తీరును ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. తాజాగా గాంధీభవన్ లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగితే..పులి లాంటి కేసీఆర్ పిల్లిలా మారి తన ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని పొన్నం నిలదీశారు. బయ్యారం ఉక్కు - ఎయిమ్స్ సహా ఇతరత్రా అంశాలను సాధించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను చూసి అయినా టీఆర్ ఎస్ పార్టీ - రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. `అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పైనే మేము తెలంగాణ కోసం ఒత్తిడి తెచ్చాం.పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడాం. కానీ కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారు? జీఎస్టీకి ముందే మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులను పొగుడుతారు. కానీ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగితే అడగకుండా ఫామ్ హౌస్‌లో పడుకుంటారు` అని ఎద్దేవా చేశారు.
పక్కరాష్ట్రం బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై పోరాటం చేయడానికి సన్నాహాలు చేస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. `మీరు బీజేపీ తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లో అన్యాయం అయితే కేసీఆర్ ప్రశ్నించకపోవడం వెనక కేసీఆర్ చేసిన అవినీతి లెక్కలు మోడీ దగ్గర ఉండటమే కారణం. ఇక ఇక్కడి బీజేపీ పార్టీ బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే నోరు మెదపడం లేదు,కేంద్రాన్ని ప్రశ్నించరు, వీరికి మోడీ అంటే భయం. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాబట్టంలో విఫలం అయింది. అందుకే ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ కి తాళం వేయండి. రానున్న రోజులలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సాధించేందుకు మా అధినాయకత్వం తో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తాం` అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ను దద్దమ్మ అన్నందుకు తనపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ తెలిపారు.