Begin typing your search above and press return to search.

పొన్నం ఐడియా అదిరిపోయిందిగా?

By:  Tupaki Desk   |   25 Dec 2016 6:37 AM GMT
పొన్నం ఐడియా అదిరిపోయిందిగా?
X
తమ ప్రత్యర్థులపై రాజకీయ నాయకులు సంధించే విమర్శనాస్త్రాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది రోటీన్ గా వ్యవహరించినా.. కొందరు మాత్రం తమ ఇమేజ్ కు తగ్గట్లు చిత్ర విచిత్రంగా రియాక్ట్ అవుతుంటారు. వారి.. క్రియేటివిటీ చూసినప్పుడు ముచ్చటేయక మానదు. అలాంటి పనినే చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు ఫైర్ బ్రాండ్ తరహాలు మాటలు తూటాల్లా పేల్చిన పొన్నం.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త కామ్ అయ్యారనే చెప్పాలి.

అప్పుడప్పుడు తన మాటలతో మెరుపు మెరిసినట్లుగా వ్యవహరించే ఆయన.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పేర్వారం రాములుకు ఒక లేఖ రాసిన ఆయన.. మహా ఎటకారం ఆడేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని.. కేసీఆర్ నివాసాన్ని పర్యాటక స్థలాలుగా గుర్తించాలని ఆయన కోరారు.

ఇలా చేయటం ద్వారా టూరిజం ప్రమోషన్ కు ఉపయోగించాలంటూ వ్యంగ్య సలహా ఇచ్చిన పొన్నం.. పూర్వకాలంలో రాజులు తాము ఉంటున్న భవనాలు.. వాస్తుకు అనుకులంగా లేకుంటే కూలగొట్టి తమకు నచ్చినట్లుగా కట్టుకుంటారని.. ప్రస్తుతం మన రాజుఅయిన కేసీఆర్ కట్టించిన పెద్ద క్యాంప్ ఆఫీస్ ఎట్లుందోనని తెలంగాణ ప్రజలు చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అందుకే.. వాటిని టూరిజం స్పాట్లుగా ప్రకటించాలన్నారు. తొమ్మిది ఎకరాల స్థలంలో రూ.500 కోట్ల ఖర్చుతో.. ఆధునిక హంగులు.. సదుపాయాలతో కట్టుకున్న రాజభవంతిని చూసి జనాలు మురిసిపోవాలని అనుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులంతా అప్పుల పాలు అవుతుంటే.. తెలంగాణ రాజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం పంటలు బ్రాహ్మండంగా ఎలా పండుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. పొన్నం ఎట‘కారం’ గులాబీ నేతలకు ఎంతగా మంట పుట్టించిందో చూడాలి.