Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ ను ఈ రేంజ్లో ఎవ‌రూ తిట్ట‌లేదేమో?

By:  Tupaki Desk   |   2 Oct 2018 9:30 AM GMT
కేటీఆర్‌ ను ఈ రేంజ్లో ఎవ‌రూ తిట్ట‌లేదేమో?
X
నాలుగేళ్లుగా నిద్రావ‌స్థ‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మ‌త్తు వ‌దిలేసి.. ఒళ్లు విదిలించుకొని.. గొంతు స‌రి చేసుకొని అధికార‌ప‌క్షం నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌టం షురూ చేశారు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో మీడియాలో పెద్ద‌గా క‌నిపించ‌ని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు అదే ప‌నిగా క‌నిపిస్తున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో తీవ్ర‌స్థాయిలో కొట్లాడిన ప‌లువురు కాంగ్రెస్‌ నేత‌లు 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌ర్వాత చ‌ప్పుడు చేయ‌కుండా కామ్ గా ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి కోవ‌కే చెందుతారు కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియ‌ర్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్‌. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రా ప్రాంత నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత కాస్త కామ్ అయ్యార‌నే చెప్పాలి.

తాజాగా గ‌ళం విప్పిన ఆయ‌న‌.. కేసీఆర్‌.. కేటీఆర్ ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ తో పాటు ఆయ‌న కుమారుడు కేటీఆర్ ను ఉద్దేశించి.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రోజుకూడా సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌కుండా ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌క‌పోవ‌టం నియంతృత్వం కాదా? అని నిల‌దీశారు పొన్నం.

ఫాంహౌస్ రాజ్యంలోప్ర‌గ‌తి భ‌వ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు బానిస‌లు కాదా? అని ప్ర‌శ్నించిన పొన్నం.. చరిత్ర‌లో ఏ సీఎం కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా పాలించ‌లేద‌ని.. ఆ ఘ‌న‌త కేసీఆర్ కే చెల్లుతుంద‌న్నారు. కొండ‌గ‌ట్టులో ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డి 62 మంది మ‌ర‌ణిస్తే.. క‌నీసం పరామ‌ర్శ కోసం రాలేద‌న్నారు. నాడు కొండ‌గ‌ట్టులో వాట‌ర్ ట్యాంకు కూలిపోతే అప్ప‌టి సీఎం వైఎస్ వ‌చ్చార‌న్నారు. మాతా స్కూల్ బ‌స్ బావిలో ప‌డి విద్యార్థులు చ‌నిపోతే అప్ప‌టి సీఎం బాబు కూడా వ‌చ్చాడ‌న్నారు.

ఆంధ్రా నేత‌ల్ని తిట్టే కేసీఆర్ ఇంత‌టి ఘోరం క‌నిపించ‌క‌పోవ‌టం బాధాక‌ర‌మ‌న్న పొన్నం.. తండ్రి కేసీఆర్ ఎంగిలి చేతితో కాకిని కొట్ట‌డ‌న్న ఆయ‌న‌.. కొడుకు కేటీఆర్ వ‌ట్టి చేతితో కూడా కాకిని కొట్ట‌డ‌న్నారు. సోనియానే తెలంగాణ ఇచ్చింద‌ని మండ‌లిలో చెప్పి.. ఇప్పుడు సోనియా అమ్మ‌నా.. బొమ్మ‌నా? అన్న మూర్ఖుడంటూ విరుచుకుప‌డ్డారు. ఢిల్లీకి గులాములు అంటూ త‌మ‌ను విమ‌ర్శిస్తున్న మంత్రి కేటీఆర్‌.. ప్ర‌జాస్వామ్యం గురించి.. ఫెడ‌ర‌ల్ విధానం తెలియ‌ని మూర్ఖుడు అని దుయ్య‌బ‌ట్టారు. 29 రాష్ట్రాలతో కూడిన భారత్ లో కీల‌క‌మైన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంటుందా? గ‌ల్లీలో ఉంటుందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉంద‌ని.. మ‌రి రాష్ట్రంలోని 31 జిల్లాల నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు టీఆర్ ఎస్ అధిష్ఠానాన్ని క‌ల‌వ‌టానికి హైద‌రాబాద్ వ‌స్తున్నారు క‌దా.. అలాంట‌ప్పుడు వారు కూడా హైద‌రాబాద్ కు రావ‌టం అంటే.. పార్టీకి గులాములు అయిన‌ట్లేనా? అని ప్ర‌శ్నించారు. ఇన్నాళ్ల‌కు పొన్నం త‌న పాత హుషారు తెచ్చి పెట్టుకోవ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ ను ఉద్దేశించి త‌ప్పులు ప‌ట్టే వారికి దిమ్మ తిరిగిపోయేలా కౌంట‌ర్ ఇచ్చినోళ్ల‌లో పొన్నం మొద‌టి వ‌రుస‌లో ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.