Begin typing your search above and press return to search.

బీసీల‌పై ప్రేమ ఉంటే...సీఎం ప‌ద‌వి ఇచ్చేయ్‌

By:  Tupaki Desk   |   3 Dec 2017 3:17 PM GMT
బీసీల‌పై ప్రేమ ఉంటే...సీఎం ప‌ద‌వి ఇచ్చేయ్‌
X
అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశ‌మై ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను వివరించి...వెనుక‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమ కోసం ఇంకేం చేయాలో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై ఆయా పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా...కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీసీ సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇప్పుడు ఎన్నిక‌ల కోస‌మే స‌మావేశం పెట్టార‌ని ఆరోపించారు.

బీసీల సంక్షేమాన్నిమూడేళ్ళ పాటు సీఎం కేసీఆర్ విస్మరించారని ఇంతకాలం పాటు బీసీలకు న్యాయం చేయనందుకు సీఎం కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ ఉపాధ్య‌క్షుడైన పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీసీల పై కేసీఆర్ కు ప్రేమ ఉంటే ఇంత కాలం ఎందుకు ఆ వ‌ర్గాల‌ను విస్మరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు ఎన్నికల నజరానా ప్రకటిస్తున్నారని విమర్శించారు. బీసీ కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు క్షమించరని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

బీసీల గురించి స‌మావేశంలో ప్ర‌సంగిస్తున్న సీఎం కేసీఆర్ ముందుగా త‌న పార్టీలో ఉన్న నేత‌ల‌కు న్యాయం చేయాల‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గౌర‌వం లేకుండా ఉండిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీలపై సంక్షేమంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవి ఏదో ఒకటి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేసింద‌ని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ బీసీల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని త‌ద్వారా అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని పొన్నం ప్రభాకర్ అన్నారు.