Begin typing your search above and press return to search.

పవన్ యాత్రను అడ్డుకుంటాం: పొన్నం

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:32 AM GMT
పవన్ యాత్రను అడ్డుకుంటాం: పొన్నం
X
ప్రజా సమస్యలను అధ్యయనం చేయడానికంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో యాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ - పవన్ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. పవన్ యాత్ర పూర్వజిల్లాల ప్రకారం కరీంనగర్‌ లో ప్రారంభమవుతోంది. పొన్నం కూడా అదే జిల్లాకు చెందిన యువతలో పట్టున్న నేత. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటనతో పవన్ యాత్ర సజావుగా సాగుతుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి.

కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని - అప్పుడే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తానంటే కోదండరామ్ కు పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం - పవన్ చేపట్టనున్న యాత్రకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. మేడారం జాతర సందర్భంగా కొండగట్టు వద్ద రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు ఆయన.

అంతేకాదు... పవన్ పర్యటన వెనుక కేసీఆర్ ఉన్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్‌ కల్యాణ్‌ ను కేసీఆర్‌ రంగంలోకి దింపుతున్నారని పొన్నం ఆరోపించారు. ఇటీవల భేటీలో కేసీఆర్‌ - పవన్‌ కల్యాణ్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణలో దళితులపై దాడులు జరుగుతున్నా, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పవన్ ఇంత వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ యాత్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.