Begin typing your search above and press return to search.

పొన్నం బరిలోకి..టీఆర్ ఎస్ కు షాకే..

By:  Tupaki Desk   |   20 Sep 2018 11:10 AM GMT
పొన్నం బరిలోకి..టీఆర్ ఎస్ కు షాకే..
X
వరుసగా మూడు సార్లు అక్కడ గులాబీ జెండానే ఎగిరింది. ఇప్పుడు నాలుగోసారి కూడా గెలిచేందుకు ఆ ఎమ్మెల్యే రెడీ అయ్యారు. బలమైన ఆ ఎమ్మెల్యేను ఓడించేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థియే లేకుండా పోయాడు. పోయిన సారి పోటీచేసిన అభ్యర్థి టీఆర్ ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ ఇప్పుడక్కడా బ్రహ్మాస్త్రాన్ని దించబోతోంది. ఇంతకీ ఎవరా బ్రహ్మస్త్రం..? ఏంటా నియోజకవర్గం.?

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ మాస్ లీడర్ గంగుల కమలాకర్ ఎదురులేకుండా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు చల్మెడ కారెక్కేందుకు రెడీ అవుతుండడంతో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువయ్యారు.

తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి బలమైన తమ ఎంపీ అభ్యర్థులనంతా ఎమ్మెల్యేలుగా పోటీచేయాలని ఆదేశించిందట.. ఈ నేపథ్యంలోనే ఇటీవలే టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్న పొన్నం ప్రభాకర్ తన ఫోకస్ కరీంనగర్ నియోజకవర్గంపై పెట్టాడట.. పొన్నంకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా వెళ్లి ఆదుకుంటాడని.. అందరితో కలిసి పోతాడని పేరుంది. అందుకే బలమైన పొన్నంను కరీంనగర్ నుంచి పోటీచేయించాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయ్యిందట.. దీనికి పొన్నం కూడా సై అన్నట్టు సమాచారం.

ఇక పోయిన సారి రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ కు కరీంనగర్ పట్టణంలో మంచి పట్టు ఉంది. ఆయనకు యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. పోయిన సారి దాదాపు ఎమ్మెల్యే గంగులను ఓడిస్తాడని అనుకున్నారు. కానీ తృటిలో చేజారింది. ఈసారి గంగుల ను ఓడించేందుకు బండి సంజయ్ పావులు కదుపుతున్నాడు.

ఇక పొన్నం ఎంట్రీతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎంపీ నుంచి ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్న బలమైన పొన్నంతో గంగుల - బండి సంజయ్ డిఫెన్స్ లో పడ్డారు. కరీంనగర్ లో ఈసారి త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురిలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.