Begin typing your search above and press return to search.

నక్క వాత లాంటి నిర్ణయం ఇది

By:  Tupaki Desk   |   12 Sep 2017 4:25 AM GMT
నక్క వాత లాంటి నిర్ణయం ఇది
X
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని సామెత. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా అలాగే కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి.. సినీ రంగంలో అగ్రపథంలో ఉన్న హీరోయిన్ ను సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే.. దానికి పోటీగా అన్నట్లుగా ఇవాళ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా.. తామొక బ్రాండ్ అంబాసిడర్ ను - ఏపీ చేనేత రంగం అభివృద్ధికి అన్నట్లుగా నియమించేశారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ఆర్భాటంగా విశాఖలో ప్రకటించేశారు. అయితే పొరుగురాష్ట్రంలో సమంత ఉన్న హోదాకు సమానంగా, ఏపీలో పూనం కౌర్ ను నియమించడం అంటే.. ఈ వ్యవహారం పులిని చూసి నక్క పెట్టుకున్న వాతల్లాగే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే.. కష్టాల్లో ఉన్న ఒక రంగాన్ని అభివృద్ధి చేయడం అంటే.. కేవలం బ్రాండ్ అంబాసిడర్ ను నియమించడంతో సరిపోదు అనే సత్యాన్ని తెలుగుదేశం అధినేత తెలుసుకోవాలి. ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇది తెలియని సంగతి కాకపోవచ్చు. కాకపోతే.. తమ రాష్ట్రంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ లేకపోతే.. అది వెనకబడ్డట్లు అవుతుందని ఆయనకు అనిపించి ఉండవచ్చు. అలా అనుకున్నా కూడా.. ఇంకాస్త టాప్ రేంజిలో ఉన్న.. యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయికను ఈ స్థానంలో పెట్టి ఉంటే.. అటు ఆశించిన ప్రయోజనానికి దగ్గరగా వచ్చేవాళ్లు. అంతే తప్ప.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నది కదాని.. ఫేడ్ అవుట్ అయిపోయిన పూనం కౌర్ ను బ్రాండ్ అంబాసిడర్ చేస్తే లాభం ఏముంటుంది?

పైగా చంద్రబాబు సర్కారు గుర్తించాల్సింది మరొక అంశం ఉంది. కేవలం ఇలాంటి నియామకాలతో ఒక రంగం బాగుపడిపోదు. చేనేత రంగం తమ కాళ్లపై తాము నిలబడడానికి ఇంకా అనేక చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పరంగా చిత్తశుద్ధి గల ప్రయత్నాలు అనేకం జత కలిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఇది ఏదో సీజనల్ సంక్షేమ పథకం లాగా కాకుండా.. నిరంతరాయ కృషిగా ఉండాలి. తెలంగాణ తరచుగా చేనేత ఫ్యాషన్ షోలను నిర్వహించడం, చేనేత కానుకలను అందరికీ అందించడం, ఆయా రూపాల్లో చేనేత గురించిన విస్తృత ప్రచారం జరిగేలా చూడడం చేస్తోంది. అలాంటి కార్యక్రమాలను కూడా చంద్రబాబు స్పూర్తిగా తీసుకోవాలి. స్ఫూర్తి ఎవరిదైనా సరే.. అంతిమ ప్రయోజనం చేనేత రంగానికి చేయూత ఇవ్వడమే అనే లక్ష్యంతో ప్రభుత్వ సాగితే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారు.