Begin typing your search above and press return to search.

రఘువీర..అంత కష్టపడ్డా డిపాజిట్ రాలేదే!

By:  Tupaki Desk   |   25 May 2019 4:05 AM GMT
రఘువీర..అంత కష్టపడ్డా డిపాజిట్ రాలేదే!
X
గతంలో కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించారు రఘువీరారెడ్డి. 2009లో ఆయన కల్యాణదుర్గం నుంచి విజయం సాధించారు. కల్యాణదుర్గం పట్టనానికి పై పై సోకులు చేయడంలో రఘువీర విజయవంతం అయ్యారు. అప్పట్లో మంత్రిగా కూడా ఉండటంతో నిధులు ఆ నియోజకవర్గానికి బాగానే తీసుకెళ్లారు.

అయితే రాష్ట్ర విభజన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిన రఘువీరారెడ్డి కల్యాణదుర్గం నుంచి మళ్లీ పోటీ చేయలేదు. కల్యాణదుర్గంలో అయితే గెలవడం కష్టమని పెనుకొండకు వెళ్లి పోటీ చేశారు. అక్కడ ఆయన చిత్తుగా ఓడారు. మూడో స్థానంలో నిలిచారు.

అయితే ఈ సారి రఘువీరారెడ్డి మళ్లీ కల్యాణదుర్గం నియోజకవర్గానికి తరలి వెళ్లారు. అక్కడ తను గతంలో చేసిన అభివృద్ధి పనులు ఈ సారి తనను గెలిపించడం ఖాయమని ఆయన ధీమాగా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు చాలా ముందే రఘువీరారెడ్డి కుటుంబం కల్యాణదుర్గంలో దిగి పని మొదలుపెట్టింది. రఘువీరారెడ్డి కూతురు నియోజకవర్గంలో గట్టిగా తిరిగారు.

ఇక తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు రఘువీరకు అనుకూలంగా మారాయని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంత రాయ చౌదరికి టికెట్ ఇవ్వలేదు. ఆయన బదులు కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే చౌదరి వెళ్లి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. చివరకు అయితే చంద్రబాబు సర్ధి చెప్పి ఆయన చేత నామినేషన్ విత్ డ్రా చేయించారు.

రఘువీరారెడ్డికి తెలుగుదేశం సహకారం ఉందని.. అందుకే అక్కడ ఆయన వియం సాధిస్తారని.. కొన్ని విశ్లేషణలు వినిపించాయి. అయితే కల్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉషశ్రీ చరణ్ ఇక్కడ ఇరవై వేలకు పైగా మెజారిటీని సాధించారు. రఘువీరారెడ్డి కనీసం డిపాజిట్ సంపాదించుకోలేకపోయారు.