Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరం వేళ పోప్ కు అంత కోపం ఎందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   2 Jan 2020 4:21 AM GMT
కొత్త సంవత్సరం వేళ పోప్ కు అంత కోపం ఎందుకొచ్చింది?
X
మన దేశంలో ప్రఖ్యాత స్వామీజీల మీద ప్రజలు చూపించే గౌరవాభిమానులకు మించి మరీ ప్రాశ్చాత్య దేశాల్లో పోప్ విషయంలో భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తారు. ఆయన మీద విపరీతమైన ప్రేమను.. అభిమానాన్ని.. గౌరవాన్ని ప్రదర్శిస్తారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో కొత్త సంవత్సరం వేళ నేటివిటి స్కీన్ కార్యక్రమం జరిగింది.

దీంతో పోప్ ను కలిసే అవకాశం ఉండటం తో భక్తులు భారీ గా హాజరయ్యారు. తమ కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చిన వారు.. పోప్ ను చూసేందుకు.. ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు.. ఆయన చేతిని తాకితే చాలన్న భావన తో వందలాదిగా ప్రజలు పోటెత్తారు. భక్త జన సందోహానికి కాస్త దూరంగా ఉంటూ.. చిన్నారును మాత్రం తాకుతూ ఆయన ఆశీర్వాదం ఇవ్వసాగారు.

చాలామంది ఆయన కోసం చేతులు జాచినా.. ఆయన మాత్రం ఎవరిని తాకకుండా ఉండిపోయారు. ఇదే సమయంలో ఒక చిన్నారిని ఎత్తుకున్న తల్లిదండ్రులు.. పోప్ ఫ్రాన్సిస్ ఆశీస్సులు పొందే క్రమంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అప్రమత్తత లేకపోవటంతో ఆ చిన్నారి కిందకు జారిపడ్డాడు. దీంతో.. ఆ చిన్నారి నుదిటి మీద ముద్దుపెట్టుకొని ఆశీర్వదించారు పోప్.

ఈ క్రమంలో మిగిలిన వారికి ఆశీస్సులు అందజేస్తూ ముందుకెళుతున్న పోప్ చేతిని ఒక మహిళ అదాటున లాగటం.. అలాంటిది ఊహించిన పోప్ జారి పడబోయారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన.. ఆ మహిళ చేతి మీద కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. చేయి వదలాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారి బిత్తర పోయిన సదరు మహిళ చేయి వదిలారు.

ఈ వీడియో మీద విమర్శలు వెల్లువెత్తటం.. పోప్ లాంటి వ్యక్తి సాదా సీదా వ్యక్తి లా వ్యవహరించటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపించింది. ఈ వ్యవహారం దుమారంగా మారటం తో పోప్ ఫ్రాన్సిస్ వివరణ ఇచ్చారు. తన చర్య పట్ల విచారం వ్యక్తం చేశారు. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. కొందరు చర్యల కారణంగా తాను సహనాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. వివరణ గొప్పగా లేకున్నా.. క్షమాపణలు చెప్పటం మాత్రం ఇప్పుడీ అంశం వార్తగా మారింది.