Begin typing your search above and press return to search.

యూపీలో జ‌నాభా నియంత్ర‌ణ‌.. బీజేపీలో నిర‌స‌న‌..!

By:  Tupaki Desk   |   14 July 2021 1:30 PM GMT
యూపీలో జ‌నాభా నియంత్ర‌ణ‌.. బీజేపీలో నిర‌స‌న‌..!
X
ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కారు జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ఇటీవ‌ల ఒక బిల్లు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో జ‌నాభా పెరిగిపోవ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని, అందువ‌ల్ల నియంత్రించాల్సిందేన‌ని అన్నారు యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌. అయితే.. ఈ బిల్లును అధికార పార్టీ నేత‌లే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. పైకి చూడ సూప‌ర్ అంటున్న‌ప్ప‌టికీ.. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఇది స‌రికాద‌ని అంటున్నార‌ట‌. ఇంత‌కీ.. వారు వ్య‌తిరేకించ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది చూద్దాం.

భార‌త‌దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర ప్రదేశ్‌. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ రాష్ట్రంలో అక్ష‌రాస్య‌త శాతం కూడా చెప్పుకోద‌గిన స్థాయిలో లేదు. ఈ రాష్ట్రంలో జ‌నాభా భారీ స్థాయిలో పెరిగిపోతోంద‌ని, దీనికి అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అక్క‌డి బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బ‌ర్త్ కంట్రోల్‌, స్టెబిలైజేష‌న్‌, వెల్ఫేర్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లులోని ప‌లు నిబంధ‌న‌లు అధికార పార్టీ నేత‌లకు న‌చ్చ‌డం లేదు. దీంతో.. పార్టీ స‌మావేశంలో ఈ బిల్లును మార్చాల‌ని అంటున్నార‌ట‌.

వాళ్లు ఇంత‌గా ఈ బిల్లును వ్య‌తిరేకించ‌డానికి కార‌ణం ఏమంటే.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారికి సంతానం విష‌యంలో నిబంధ‌న‌లు విధించారు. ఈ బిల్లు ప్ర‌కారం ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ పిల్ల‌లు ఉన్న‌వారు స్థానిక సంస్థ‌ల్లో పోటీ చేయ‌డానికి అన‌ర్హులు. ఒక్క‌రు, లేదా ఇద్ద‌రు పిల్ల‌లు మాత్ర‌మే ఉండాలి. అప్పుడే వారు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అర్హ‌త సాధిస్తారు. ఈ కీల‌క పాయింట్ స‌రికాద‌ని, దీన్ని మార్చేయాల‌ని కోరుతున్నార‌ట అక్క‌డి బీజేపీ నేత‌లు.

ఎందుకంటే.. ఆ పార్టీ త‌ర‌పున రాజ‌కీయాల్లో ఉన్న‌వారిలో చాలా మంది ఈ నిబంధ‌న ప్ర‌కారం అర్హ‌త సాధించ‌లేరు. చాలా మంది నాయ‌కుల‌కు ముగ్గురు, అంత‌క‌న్నా ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్నారు. కేవ‌లం స్థానిక నేత‌లే కాదు.. చివ‌ర‌కు ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారి ప‌రిస్థితి కూడా ఇంతే. ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీలో బీజేపీ త‌ర‌పున 304 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది చ‌ట్టంగా మారితే.. ఆ త‌ర్వాత శాస‌న సభ‌కు సైతం ఈ చ‌ట్టం అమ‌లు చేస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఎమ్మెల్యేల భ‌యంగా తెలుస్తోంది.

మొత్తం అసెంబ్లీలో ఉన్న 304 మందిలో ఏకంగా.. 152 మంది ఈ బిల్లు ప్ర‌కారం అన‌ర్హులుగా అయిపోతారు. అంటే.. బీజేపీ ఎమ్మెల్యేల్లో దాదాపు స‌గం మంది ఖాళీ అయ్యే అవకాశం ఉంద‌న్న‌మాట‌. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల‌ సంఖ్య కేవ‌లం 137 మాత్ర‌మే. ఇంకా లోతుగా వెళ్తే.. బీజేపీ ఎమ్మెల్యే సంతానం చూసి నోరెళ్ల బెట్టాల్సిందే. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఒక బీజేపీ ఎమ్మెల్యేకు ఏకంగా 8 మంది పిల్ల‌లు ఉన్నారు. మ‌రో ఎమ్మెల్యేల‌కు ఏడుగురు పిల్ల‌లు జ‌న్మించారు.

ఇక‌, ఆరుగురు పిల్ల‌లు క‌న్న ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు. న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన వారు ఏకంగా 44 మంది ఉండ‌గా.. ముగ్గురు పిల్ల‌లు ఉన్న ఎమ్మెల్యేలైతే 83 మంది ఉన్నారు. ఈ చ‌ట్టం గ‌న‌క అసెంబ్లీకి కూడా వ‌ర్తిస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వీరంతా.. గ‌గ్గోలు పెడుతున్నార‌ట‌. సొంత పార్టీ తెచ్చిన బిల్లు కాబ‌ట్టి.. పైకి అద్భుతం.. ఆహా అని పొగుడుతున్న‌ప్ప‌టికీ.. లోప‌ల మాత్రం ర‌గిలిపోతున్నార‌ట‌. మ‌రి, దీనిపై యోగీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అన్న‌ది ఆసక్తిక‌రంగా మారింది. దీన్ని కేవ‌లం స్థానిక సంస్థ‌లకు పరిమితం చేస్తారా? ఎందుకొచ్చిన తిప్ప‌లు అని ఆ నిబంధ‌న మారుస్తారా? అన్న‌ది చూడాలి.