Begin typing your search above and press return to search.

మన కుటుంబ సభ్యులు 127,42,39,769

By:  Tupaki Desk   |   11 July 2015 10:58 PM GMT
మన కుటుంబ సభ్యులు 127,42,39,769
X
అవును.. భారతదేశ తాజా జనాభా సంఖ్య. ఇప్పటివరకూ ఏదైనా సభలో మాట్లాడే సందర్భంగా 125 కోట్ల భారతీయులం మనం అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. అయితే.. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జాతీయ జనాభా స్థిరీకరణ నిధి తాజాగా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తాజాగా మన దేశ జనాభా 127కోట్ల చిల్లరగా తేల్చింది.

జూలై 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు దేశ జనాభా ఎంతన్న విషయాన్ని వెల్లడించిన ఈ సంస్థ.. ఈ సందర్భంగా మరిన్ని అంశాల్ని పేర్కొంది. వార్షికంగా 1.6శాతం వృద్ధి రేటుతో సాగుతున్న జనాభా కారణంగా 2050 నాటికి దేశంలో జనాభా సంఖ్య 163కోట్లు అయ్యే అవకాశం ఉందని.. ఆ సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని.. ఇప్పటివరకూ జనాభాలో ప్రధమ స్థానం ఉన్న చైనాను అధిగమిస్తుందని అంచనా వేసింది.

ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతీయులు 17.25 శాతమని.. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లుగా గుర్తు చేసింది. ఆ సందర్భంగా ప్రపంచంలోని అమెరికా.. ఇండోనేషియా.. బ్రెజిల్‌.. పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌.. జపాన్‌ దేశాల్లోని మొత్తం జనాభాకు.. భారతదేశంలోని జనాభాకు సమానమని తెలిపింది. అంతేకాదు.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లోని జనాభా.. పెద్ద దేశాల్లోని జనాభా కంటే ఎక్కువగా పేర్కొంది.

ఒక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనాభా.. బ్రెజిల్‌ దేశ జనాభాతో సమానమని తెలిపింది. ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ జనాభా మనదేశంలోని యూపీ కంటే తక్కువ కావటం గమనార్హం. మిగిలిన విషయాల్లో వృద్ధి రేటు ఎలా ఉన్నా.. జనాభా వృద్ధిలో మాత్రం మనం దూసుకెళుతున్నామనే చెప్పాలి.