Begin typing your search above and press return to search.

శ్రీశ్రీ.. ‘దొంగ లంజకొడుకు’ అన్న దానికి పొంత లేని పోసాని మాట?

By:  Tupaki Desk   |   29 Sep 2021 7:30 AM GMT
శ్రీశ్రీ.. ‘దొంగ లంజకొడుకు’ అన్న దానికి పొంత లేని పోసాని మాట?
X
ప్రెస్ మీట్ పెట్టేసి.. దారుణమైన పదాల్ని వాడేస్తూ.. పవన్ కల్యాణ్ పై విరుచుకపడిన నటుడు పోసాని. మాటల మధ్యలో మహా కవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) ప్రస్తావన తీసుకురావటం.. ఆయన రాసిన మహాప్రస్థానం కవితా సంపుటిని కోట్ చేసిన వైనంపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైత్యంతోనో.. మరింకేదో ఎజెండాతో మాట్లాడే మాటలకు.. రిఫరెన్సుగా శ్రీశ్రీని వాడుకోవటం సబబు కాదన్న మాట వినిపిస్తోంది.

తన కవితలో ‘‘దొంగలంజలకొడుకులు అసలు మసలే ధూర్త లోకంలో ’’ అంటూ ఉపయోగించిన సందర్భానికి.. పోసాని ప్రస్తావన తెచ్చిన దానికి ఏమైనా పోలిక ఉందా? అన్నది ప్రశ్న. శ్రీశ్రీ లాంటి చైతన్యశీలి.. అంత దారుణపదప్రయోగాన్ని తన కవితలో ఎందుకు రాశారు? ఎలా రాస్తారు? అన్న ప్రశ్న సబబే. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణానికి.. పోసాని ఆయన పేరును ప్రస్తావించి.. తన అవసరాల కోసం ఇట్టే ఆ పదాన్ని వాడేయటం తీవ్ర అభ్యంతరకరం.

ఇంతకీ శ్రీశ్రీ తన కవితలో అలాంటి పదాన్ని ఎందుకు వాడారు? అసలు ఆ కవితలో ఏముంటుంది? అన్నదిప్పుడు కొందరికి ప్రశ్నగా మారింది. ఒక బ్లాగులో శ్రీశ్రీ రాసిన వ్యాఖ్యల గురించి ఎందుకన్నది వివరిస్తూ.. ఆయన ఎంతో గొప్పగా అభిమానించే తన స్నేహితుడు కొంపెల్ల జనార్ధనరావు దూరమయ్యారనే భాద.. వారి స్నేహ బంధం ఎంత బలమైనదో చెప్పేలా సదరు కవిత ఉంటుంది. 1930-40 మధ్య కాలంలో రాసిన మహాప్రస్థానంలో అంకిత వాక్యాలు కూడా కవిత రూపంలో శ్రీశ్రీ రాశారు. అందులో వచ్చే బూతు పదం కూడా.. భావోద్వేగంతో ఇట్టే ఇమిడిపోతుంది. దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా తీవ్ర ఆగ్రహంతో ప్రస్తావించిన మాటకు పొంతన లేదు.

ఇంతకీ.. ఆయన ఆ పదాన్ని ఉపయోగించిన కవిత ఎలా ఉంటుందన్నది చూస్తే..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

తలపోసినవేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక...
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...
అటు పోతే, ఇటు పోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం!
చిరునవులనే పరిషేచన చేస్తూ...

అడుగడుగునా పొడచూసే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే,
వంచకాల ఈ లోకంతో పొసగక
అచింతానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని...
అన్నీ, తన్నివేశావా నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగడం

జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకోని,
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడున్నామో, ఎక్కడకు పోతామో తెలియని,
ఆవేశంతో,
చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ,
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించించో, శఠించిందో మనల్ని..
తుదకు నిన్ను విష నాగురలలోకి లాగి,
ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జాలలు,
గుండెల్లో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ధం చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను..
ఎంత మోగించిందయ్యా మమ్ము..
ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప...
ఆకాశం పడిపోకుండానే ఉంది..
ఆఫీసులకి సెలవు లేదు..
సారా దుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది..
సానుభూతుల సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం...
ఎవరి పనులలో వాళ్లు..
ఎవరి తొందరలో వాళ్లు..
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నియంత్రిస్తే..
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు..
మా బురఖా మేము తగిలించుకున్నాం..
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే..
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు..
లేదు నేస్తం! లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు..
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము..

ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు..
భయం లేదులే అయినప్పటికీ..
నీ సాహసం ఒక ఉదాహరణ..
నీ జీవితమే ఒరవడి..
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు..

కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను..
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను..
అందుకో ఈ చాచిన హస్తం..
ఆవేశించు నాలో..
ఇలా చూడు నీ కోసం..
ఇదే నా మహాప్రస్థానం..!

-- శ్రీ శ్రీ