Begin typing your search above and press return to search.

10 రోజుల్లో వెయ్యిమంది పిల్లలకు పాజిటివ్ .. రాష్ట్రంలో కరోనా జోరు !

By:  Tupaki Desk   |   17 May 2021 5:40 AM GMT
10 రోజుల్లో వెయ్యిమంది పిల్లలకు పాజిటివ్ .. రాష్ట్రంలో కరోనా జోరు !
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు రోజురోజుకి పెరిగిపోతూ ప్రజలని మరింత ఆందోళనకి గురిచేస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే మరణాల సంఖ్య బాగా పెరిగింది. అలాగే ఈ మహమ్మారి చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ మహమ్మారి సోకుతోంది. మొదటి వేవ్ లో కరోనా చిన్న పిల్లల జోలికి పోలేదు. కానీ, సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా వ్యాపిస్తోంది. చిన్నారుల పై తీవ్ర ప్రభావం కరోనా మహమ్మారి చూపిస్తుందని ఇప్పటికే పలువురు వైద్యనిపుణులు చెప్పారు. వారు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి.

ఉత్తరాఖండ్ లో 10 రోజుల్లో తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు వెయ్యిమందికి కరోనా కరోనా సోకినట్లు ఒక సర్వే చెబుతోంది. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్‌ లో ఉన్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్‌ 1- 15 తేదీల మధ్య 264 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత ఈ సంఖ్య పెరిగింది. ఏప్రిల్‌ 16- 30 తేదీల్లో 1,053 మందికి కరోనా సోకగా, మే 1- 14 తేదీల మధ్య 1,618 మంది చిన్నారులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇది చిన్నారుల పై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందనే విషయాన్ని సూచిస్తోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఒక్కటే కాదు. దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై వ్యాక్సిన్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది.

ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వివిధ దశల్లో ఉన్నాయి. రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్‌ ప్రయోగాలకు భారత్‌ బయోటెక్‌ కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లో ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు కూడా పిల్లలపై టీకా ప్రయోగాలు చేస్తున్నాయి. 12-18 ఏళ్ల వారిపై మోడెర్నా టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో రానున్నాయి. 2-11ఏళ్ల వారిపైనా ఈ సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనుంది. ఇక ఫైజర్‌ సంస్థ 12ఏళ్ల పైబడిన వారి కోసం తయారు చేసి టీకాకు అమెరికా, కెనడా ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నొవావాక్స్‌ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకూ చిన్నారుల విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.