Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్స్

By:  Tupaki Desk   |   1 Oct 2021 12:30 AM GMT
హుజూరాబాద్ లో కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్స్
X
త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం పార్టీలు అప్పుడే వేట మొదలుపెట్టాయి. ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులంతా ప్రతీ ఓటు కీలకంగా భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఈ పోరు సాగుతోంది. ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని భావిస్తున్నారు.

దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ హుజూరాబాద్ లో ఉంటుందని భావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతరెడ్డి మధ్య జరిగిన హోరాహోరీ పోరు జరిగింది. రఘునందన్ రావు కేవలం 1079 ఓట్లతో బయటపడ్డాడు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా కేవలం వందల ఓట్ల తేడాతో బయటపడుతారని చెబుతున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ రెండూ గెలుపు నాదంటే నాదన్న ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గడపగడపకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో అది మరింత రసకందాయంలో పడనుంది.

అయితే ఈ ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చేది పోస్టల్ బ్యాలెట్లు. హుజూరాబాద్ లో 12వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఇది ఈసారి ఈ నియోజకవర్గం ప్రత్యేకత.. ఎన్నికల కమిషన్ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి ఈ పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు.

హుజూరాబాద్ లో 80 ఏళ్ల పైబడిన వృద్ధులైన ఓటర్లు 4454 మంది ఉన్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఉంది. అలాగే 8139 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఇక వృద్ధులు, వికలాంగులతోపాటు పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో మొత్తం హుజూరాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య 7శాతం వరకు ఉంది. వీరే గెలుపులో కీలకంగా మారారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓటుకోసం రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపును డిసైడ్ చేసేలా ఇవి ఉండడంతో ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.