Begin typing your search above and press return to search.

ఆ రెండు మిఠాయిల చరిత్రను భవిష్యత్ తరాలకు అందేలా చేశారు

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:23 AM GMT
ఆ రెండు మిఠాయిల చరిత్రను భవిష్యత్ తరాలకు అందేలా చేశారు
X
మిఠాయిలు చాలానే ఉండొచ్చు. కానీ.. కొన్ని మిఠాయిలకు ఉన్న చరిత్ర.. దాని రుచి.. దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు మిఠాయిలు అన్నంతనే గుర్తుకు వచ్చే స్వీట్లు ఎన్ని ఉన్నా.. కాకినాడ కాజాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పొడిపొడిగా ఉన్నట్లుగా కనిపిస్తూ.. చిన్న ముక్కను కొరికినంతనే.. లోపలి రసం పొంగుకు రావటం.. దాన్ని కింద పడకుండా నేర్పుగా తినేయటంలో ఉండే మజా ఎంత చెప్పినా తక్కువే.

అదే సమయంలో మాడగుల హల్వా రుచి భిన్నంగా ఉండటమే కాదు.. దాన్ని సరైన రీతిలో తయారు చేయాలే కానీ.. దాన్ని ఎవరూ మర్చిపోలేదు. దాని రుచికి ఫిదా కావాల్సిందే. సౌతిండియాలో బోలెడన్ని స్వీట్లు ఉన్నా.. వందేళ్లకు పైనే చరిత్ర ఉన్న స్వీట్లలో గొట్టం కాజా ఒకటి. దీన్ని ఎవరు తయారు చేశారు?అని ప్రశ్నిస్తే.. దీన్ని అమితంగా ఇష్టపడే వారు సైతం వివరాలు చెప్పలేరు. అయితే.. ఈ గొట్టం కాజాను తయారు చేసిన వ్యక్తి పేరు ‘కోటయ్య’. దీన్ని ఆయన 1891లో తొలిసారి తయారు చేసినట్లుగా చరిత్ర చెబుతోంది.

ఈ మిఠాయిని తయారు చేసిన సుమారు 125 ఏళ్ల కు పైనే అయ్యాక..కొందరి చొరవతో ఈ స్వీటుకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం లభించింది. దీంతో.. ఈ మిఠాయికి అంతర్జాతీయంగా మరింత ప్రచారానికి అవకాశం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఘన చరిత్ర ఉన్న కాకినాడ కాజాకు మరింత గుర్తింపు దక్కేలా పోస్టల్ శాఖ ఒక ప్రత్యేక కవర్ ను విడుదల చేసింది. అంతేకాదు.. మాడగుల హల్వాకు తాజాగా లభించిన గుర్తింపుతో.. భవిష్యత్తు తరాలకు ఈ రెండు మిఠాయిలు తెలిసేలా చేస్తుందని చెప్పాలి.

ఇక్కడ.. మాడగుల హల్వాకున్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిందే. దీన్ని తొలిసారి 1890లో విశాఖ జిల్లా మాడగులలో తయారు చేశారు. గోధుమపాలు.. నెయ్యి.. జీడిపప్పు.. బాదంపప్పు సమాహారంగా తయారు చేసే ఈ హల్వాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. దీనికి లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంటుందని చెబుతారు. రుచికి రుచితో పాటు.. అంతకు మించిన పనితనాన్ని పెంచేందుకు సాయం చేసే ఈ స్వీటుకు సంబంధించిన పోస్టల్ కవర్ ను కూడా తపాలా శాఖ విడుదల చేసింది.