Begin typing your search above and press return to search.

మీడియా సంస్థ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు పోయించ‌నున్న పీవీపీ!

By:  Tupaki Desk   |   16 July 2019 6:27 AM GMT
మీడియా సంస్థ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు పోయించ‌నున్న పీవీపీ!
X
కొంద‌రు ప్ర‌ముఖుల‌కు మాట ప‌ట్టింపు ఎక్కువ‌. త‌మ జోలికి రానంత‌వ‌ర‌కూ పెద్ద‌గా ప‌ట్టించుకోని వారు.. త‌మ‌ను టార్గెట్ చేశార‌న్న భావ‌న‌కు వ‌స్తే మాత్రం చెల‌రేగిపోతుంటారు. దేనికైనా.. ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా అలాంటి ప‌రిస్థితుల్లోకి ప్ర‌ముఖ సినీ నిర్మాత క‌మ్ రాజ‌కీయ నేత పీవీపీగా చెప్పాలి. మొన్న‌టి ఎంపీ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి.. త‌క్కువ తేడాతో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.

డీసెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. మిగిలిన వారితో పోలిస్తే.. ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడే ఆయ‌న‌కు కొన్నిసార్లు కోపం చాలా ఎక్కువ‌గా వ‌స్తుందంటారు. ఇక.. కొన్ని విష‌యాల్లో విప‌రీత‌మైన ప‌ట్టింపుల‌కు పోవ‌టం కూడా ఆయ‌న‌కు అల‌వాటుగా చెప్పేవాళ్లు ఉంటారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న‌ను బ‌ద్నాం చేసిన వారిపై న్యాయ‌పోరాటానికి దిగాల‌ని డిసైడ్ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ వేయ‌ని రీతిలో.. త‌న‌పై అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు వేసి.. త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసిన‌ట్లుగా భావిస్తున్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి కేశినేని నానినితో పాటు.. మ‌రో రెండు మీడియా సంస్థ‌ల పైనా ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు.. నింద‌లు వేసిన కేశినేని నాని మాట‌ల్ని ప‌లు ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం చేశారు. వారి విష‌యంలోనూ ఆయ‌న కేసు వేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం. కేశినేని నానితో పాటు కేసులు వేయ‌బోతున్న చాన‌ళ్ల విష‌యానికి వ‌స్తే టీవీ5.. మ‌హా టీవీల మీదా క‌లిపి ఒక్కొరిపైనా వంద కోట్ల రూపాయిల చొప్పున రూ.300 కోట్ల భారీ ప‌రువున‌ష్టం దావా వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే రాజ‌కీయ‌రంగంలోనూ.. మీడియాలోనూ సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. త‌న విష‌యంలో మరెవ‌రూ తొంద‌ర‌ప‌డ‌ర‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆగ‌స్టు రెండో వారంలో ఈ కేసుల వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చే వీలుంద‌న్న స‌మాచారం అందుతోంది.