Begin typing your search above and press return to search.

పొట్టు అమ్మన్ తమిళనాడులో ఉన్నాడా?

By:  Tupaki Desk   |   17 March 2016 6:33 AM GMT
పొట్టు అమ్మన్ తమిళనాడులో ఉన్నాడా?
X
సినిమా కథలకు సంబంధించి భాషా ఒక ట్రేడ్ మార్క్. సాదాసీదా బతికే హీరో సామాన్యుడు కాదని.. అసమాన్యుడని.. పేరు మార్చుకొని.. గుట్టుగా కాలం వెళ్లదీస్తుంటాడని చెప్పటం.. అతడి రేంజ్ ఎంతో తెలుసా అన్నట్లుగా చూపించే ఆ సినిమాతో.. హీరో ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద మాఫియా డాన్ గా.. లేదంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా.. లేదంటే మరోలా చూపించే కథనాలు మొదలయ్యాయి. భాషా సినిమాలో మాదిరే ఒక రియల్ లైఫ్ లోనూ అలాంటిదే ఒక ఉదంతం ఉందంటూ శ్రీలంకలోని ఒక పత్రిక రాసిన కథనం అటు ఆ దేశంలోనే కాదు.. తమిళనాడులోనూ సంచలనం సృష్టిస్తోంది.

ఇంతకీ ఆ కథనం ఎవరిని ఉద్దేశించి అంటే.. పొట్టు అమ్మన్ గురించి. ఇంతకీ ఈ పొట్టు అమ్మన్ ఎవరు? ఆయనకు శ్రీలంకకు సంబంధం ఏమిటి? మధ్యలో తమిళనాడు ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న సందేహాలు వచ్చేస్తున్నాయా? మొదటి నుంచి వివరంగా చెప్పేస్తాం. మీకు ఇట్టే అర్థమైపోతుంది.

శ్రీలంక రాజకీయాలతో పరిచయం ఉన్న వారికి కానీ.. ఎల్టీటీఈకి సంబంధించి వివరాలతో ఆసక్తి ఉన్న వారికి పొట్టు అమ్మన్ సుపరిచితుడు. మన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపింది ఎల్టీటీఈ దళ సభ్యులే అన్న విషయం తెలిసిందే కదా. ఆ సంస్థకు.. ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన వ్యక్తే ఈ పొట్టు అమ్మన్. ఎల్టీటీఈ పెద్దపులి ప్రభాకరన్ కు కుడి భుజంగా చెప్పే ఈ పొట్టు అమ్మన్.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చెబుతుంటారు.

ప్రభాకరన్ ను శ్రీలంక సైనిక దళాలు చంపినప్పుడే.. పొట్టు అమ్మన్ ను చంపేసినట్లుగా అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఆయన మరణానికి సంబంధించిన ఆధారాలు చూపించనప్పటికీ.. ఆయన చనిపోయారంటూ రాజపక్సే సర్కారు అధికారికంగా వెళ్లడించింది. అది నిజమేనని ప్రపంచం అనుకున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. పొట్టు అమ్మన్ చనిపోలేదంటూ నిన్న శ్రీలంకకు చెందిన ఒక పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే.. ఈ కథనం మొత్తానికి చిన్న ఆధారంగా చూపించటం సందేహాలకు అవకాశం ఇస్తోంది. ఈ సందేహాల్ని కాసేపు పక్కన పెట్టి.. సదరు కథనంలోకి వెళితే.. పొట్టు అమ్మన్ చనిపోలేదని.. పెళ్లాం పిల్లలతో హాయిగా బతికే ఉన్నాడని.. అతగాడు ప్రస్తుతం భారతదేశంలోని తమిళనాడులో ఉన్నారని వెల్లడించింది. పొట్టు అమ్మన్ కాస్తా తన పేరును ‘‘కురుడు’’ అన్న మారుపేరుతో బతికేస్తున్నాడని.. అతడిప్పుడు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కథనం ఇప్పుడు శ్రీలంకలోనూ.. తమిళనాడులోనూ హాట్ టాపిక్ గా మారింది.