Begin typing your search above and press return to search.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత !

By:  Tupaki Desk   |   11 Jan 2021 10:40 AM GMT
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత !
X
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఫిక్స్ చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థి గా సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఆమె బీఫామ్‌ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు.

గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా వ్యవహరించిన పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో శాసనమండలిలో ఖాళీ ఏర్పడింది. ఆ ఒక్క ఖాళీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా, వైసీపీ తరఫున పోతుల సునీతకే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నేడు నిర్ణయించారు. దీనితో ఆమె ఖాళీ చేసిన సీటును ఆమెకే కేటాయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత పేరును సీఎం జగన్ ఖరారు చేశారు.

పోతుల సునీత 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. చీరాల అసెంబ్లీ స్థానంలో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దాంతో పోతుల సునీత వర్గానికి, ఆమంచి వర్గాని మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమెకు టీడీపీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. ఇక 2019 ఎన్నికల వేళ ఆమంచి వైసీపీలోకి వెళ్లగా, సునీత మాత్రం టీడీపీలోనే ఉన్నారు.అయితే, ఎన్నికల అనంతరం ఆమె టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీకి మద్దతు పలుకుతుండడంతో ఆమెపై అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనమండలి చైర్మన్ ను కోరింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో మండలిలో ఖాళీ ఏర్పడింది.