Begin typing your search above and press return to search.

దేశంలో 12 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం

By:  Tupaki Desk   |   29 April 2022 4:46 AM GMT
దేశంలో 12 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం
X
అసలే ఎండాకాలం.. ఉక్కపోతతో చస్తున్న జనం.. దీనికి తోడు కరెంట్ కోతలు.. ఏసీలు, కూలర్లు అన్నీ ఆన్ చేయడంతో కరెంట్ సరిపోక దేశ ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రంలో కూడా పవర్ హాలీడే ప్రకటించిన దుస్థితి. ఈ ఒక్క రాష్ట్రమే కాదు.. దేశంలో 12 రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ , హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్ , ఏపీ, ఉత్తరప్రదేశ్‌ లలో అత్యధిక కోతలున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పవర్‌ కట్స్‌ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. గత 38 ఏళ్లల్లో చూస్తే ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. దీనికి తోడు వేసవికి ముందు చూస్తే తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి బొగ్గు నిల్వలు పడిపోయాయి.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే. కానీ కోవిడ్‌ ఆంక్షలన్నీ పూర్తిగా ఎత్తేయడంతో భారతీయ పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కానీ బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ కోతలు తప్పట్లేదు.

-కోతలు విధిస్తున్న రాష్ట్రాలు ఇవే..

దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, గుజరాత్, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ తోపాటు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 8.7 శాతం విద్యుత్‌ లోటును ఎదుర్కొంటోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా పరిశ్రమలు 50 శాతం సరఫరాతో నడుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ కోతలు తప్పట్లేదు. విద్యుత్‌ కోతలపై ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొంటున్నారు. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 50–55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటోందని సమాచారం.

తెలంగాణలోనూ వ్యవసాయానికి 7 గంటలే..

డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. శుక్రవారం నుంచి రోజుకి 7 గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రోజున రాత్రంతా సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయాలని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్‌ఈలు, డీఈలకు ఆదేశాలు జారీ చేసింది.