Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఆఫీసులకే పవర్ కట్... షాక్ ఇచ్చేసిన విద్యుత్ శాఖ

By:  Tupaki Desk   |   6 Aug 2022 8:33 AM GMT
ప్రభుత్వ ఆఫీసులకే పవర్ కట్... షాక్ ఇచ్చేసిన విద్యుత్ శాఖ
X
ప్రభుత్వంలో ఒక విభాగం పనిచేయాలంటే దానికి డబ్బులు కావాలి. అది మరో ప్రభుత్వ విభాగం అయినా డబ్బులు చెల్లించకపోతే ఎక్కడ నుంచి తీసుకువస్తారు. అందుకే ఎన్నో సార్లు చేసిన విన్నపాలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వ ఆఫీసుల మీదనే తమ పవర్ ఏంటో చూపించారు. ఏకంగా పవర్ కట్ చేసి తామేంటో చాటి చెప్పారు. ఒంగోలు జిల్లాల్లో విద్యుత్ శాఖ అధికారుల విశ్వరూపం ఒక్కసారిగా చూసిన మీదట ప్రభుత్వ అధికారులకు ఇక కంటికి కనిపించేది ఒక్క చీకటి మాత్రమే అని అర్ధమయింది.

అయినా ముందే ఎన్నో హెచ్చరికలు చేసినా మేలుకోకుండా కాలాయాపన చేసిన ఫలితం ఇది అని కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖకు వందల వేల కోట్ల బకాయిలు పెడితే ఎలా మనుగడ సాగిస్తుంది అన్నది చూడాలి కదా. సగటు జనాలు బిల్లులు కట్టకుండా మొరాయిస్తూంటే దానికి పనిష్మెంట్ గా కరెంట్ ని కట్ చేసి తన ప్రతాపాన్ని అధికారులు చూపిస్తారు. ఇపుడు అదే తీరున ప్రభుత్వ ఆఫీసులు అయినా మాకేంటి లెక్క అంటూ కరెంట్ కట్ చేసి ఇక చూస్కోండి అంటూ సర్కారీ బాబులకు సరదా తీర్చేశారు.

ఇక వివరాలు చూస్తే విద్యుత్ శాఖ చేసింది కరెక్ట్ అనిపించకమానదు. ఒక్క ఒంగోలులోనే ఏకంగా 392 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ బకాయి పడింది. ఇవన్నీ వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో పేరుకుపోయిన బకాయిలు. ఇందులో అతి పెద్ద మొత్తం, అగ్ర తాంబూలం ఎవరిది అంటే ఆర్ డబ్ల్యు ఆఫీస్. ఈ ఒక్క ఆఫీసే ఏకంగా 112 కోట్ల రూపాయలు బకాయి పడిపోయింది. ఆ తరువాత వాటాగా చూస్తే పంచాయతీరాజ్‌ శాఖ 90 కోట్లు, ఇరిగేషన్‌ శాఖ 100 కోట్లు, మున్సిపాలిటీలు 13 కోట్లు, విద్యాశాఖ 7 కోట్లు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు తీసి చూపిస్తున్నారు.

అదే టైం లో తాము ఎన్నో సార్లు తాఖీద్లు ఇచ్చి మరీ అలెర్ట్ చేశామని కూడా చెబుతున్నారు. అయినా సర్కారీ ఆఫీసులలో ఏ మాత్రం రెస్పాన్స్ లేదని అంటున్నారు. అందుకే సామాన్యుడికి ఏ రకమైన శిక్ష విధించామో అదే తీరున ప్రభుత్వ ఆఫీసులకు కూడా విధించామని వారు సమర్ధించుకుంటున్నారు.

ఇక ప్రభుత్వ ఆఫీసుల నిర్వాకం చూస్తే నెలల తరబడి బిల్లులు కట్టకుండా కాలాయాపన చేశారు. ఇక వారికి ఊరట ఇచ్చేలా ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 10వ తేదీ లోపు విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే సర్‌చార్జి మినహాయిస్తామని నెలరోజుల నుంచి నోటీసులు జారీ చేసి మరీ చెబుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. ఇలా అన్నీ అయ్యాక ఇక కట్టరని నిర్ణయించుకున్న మీదటనే కరెంట్ కట్ చేసి పారేశారు అన్నమాట.

ఈ విధంగా ఒంగోలు జిల్లాలో అనేక ప్రభుత్వ ఆఫీసులు ఇపుడు చీకటిలో మగ్గుతున్నాయి. కరెంట్ లేకపోతే ఈ రోజు ఒక్క ఆఫీస్ పని కూడా సాగదు. మరి కరెంట్ కట్ చేశాక అయినా వారిలో చలనం వచ్చి ఎంతో కొంత బిల్లులు చెల్లిస్తారెమో చూడాలని అంటున్నారు.