Begin typing your search above and press return to search.

మరుగుదొడ్డిలో పీపీఈ కిట్లు .. ఆందోళనలో స్థానికులు !

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:00 PM GMT
మరుగుదొడ్డిలో పీపీఈ కిట్లు .. ఆందోళనలో స్థానికులు !
X
పీపీఈ ( పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు .. కరోనా సోకిన బాధితులకి చికిత్స అందించే వైద్యులు వేసుకునే రక్షణ కవచం. అయితే,వీటిని ఒకసారి వినియోగించిన తరువాత చాలా జాగ్రత్తగా కాల్చేయాలి. కానీ , అలా చేయకుండా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల్లో దర్శనమిస్తే భయం కట్టలు తెంచుకోవడం సహజమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊరి చివరన పీపీఈ కిట్లు దర్శనం ఇవ్వటంతో అదే జరిగింది. స్థానికుల భయంతో అక్కడ కలకలం రేపింది. అసలే మంచిర్యాల జిల్లాలో ప్రజలు కరోనా భయంతో విలవిలలాడుతుంటే ఇక కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు ధరించే పీపీఈ కిట్లు శ్మశాన వాటికల్లో, మరుగుదొడ్లలో కనిపించటంతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురయ్యారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పీపీఈ కిట్ల కలకలం రేగింది. స్థానిక శ్మశానవాటిక, డంపింగ్ యార్డుల ప్రాంగణంలోని మరుగుదొడ్డిలో రెండు పీపీఈ కిట్లు కంటపడటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజులక్రితం అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారని స్థానికులు చెప్తున్నారు. అయితే, అతడి అంత్యక్రియల సందర్భంలో ఈ పీపీఈ కిట్లు వినియోగించినట్లు ప్రచారం జరిగింది.

దీంతో మృతుడు కరోనా వ్యాధితోనే మరణించాడనే ప్రచారం వ్యాపించింది. అయితే మృతుడు ఎవరు అనేది కూడా తెలియక పోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పీపీఈ కిట్లు వాడిన తర్వాత వాటిని దహనం చేయాల్సి ఉంటుంది. అలాంటిది మరుగుదొడ్డిలో పడి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ పీపీఈ కిట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.