Begin typing your search above and press return to search.

కౌన్సిలింగ్‌ తర్వాత ప్ర‌దీప్ ఎంత మారిపోయాడో

By:  Tupaki Desk   |   8 Jan 2018 12:10 PM GMT
కౌన్సిలింగ్‌ తర్వాత ప్ర‌దీప్ ఎంత మారిపోయాడో
X
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి పట్టుబడ్డ యాంక‌ర్‌ ప్రదీప్...సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ తన తండ్రితో కలిసి హాజరయ్యారు. కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. మోతాదుకు మించి ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. అయితే.. ప్రదీప్‌కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. 170కి పైగా పాయింట్లు నమోదైన విషయం విదితమే.

గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రానికి ప్రదీప్ తన తండ్రితో కలిసి వచ్చారు. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ ప్ర‌దీప్ మీడియాతో మాట్లాడుతూ మద్యం ఆరోగ్యానికి హానికరమని స్పష్టం చేశారు! `కౌన్సెలింగ్‌ కు రాలేదు రాలేదు అంటున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నందునే కౌన్సెలింగ్‌ కు హాజరు కాలేకపోయాను` అని వ్యాఖ్యానించారు. `కౌన్సెలింగ్‌ కు ఈ రోజు రావాలని మెసేజ్ వచ్చింది. కౌన్సెలింగ్‌ లో భాగంగా ఫుల్ సెషన్ ఉన్నాను. దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మద్యం సేవించి డ్రైవింగ్ ఎందుకు చేయకూడదనే విషయాలు చెప్పారు. మద్యం ఆరోగ్యానికి హానికరం` అని ప్రదీప్ తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కౌన్సెలింగ్ ద్వారా త‌న‌కు అనేక అంశాలు తెలిసివ‌చ్చాయ‌ని యాంక‌ర్ ప్ర‌దీప్ వివ‌రించారు. `ఈ కౌన్సెలింగ్ ద్వారా నాకు తెలిసిన విషయాలు మిగతా వారికి తెలియజేస్తాను. నేను చేసినట్లు ఎవరూ కూడా చేయవద్దని విజ్ఞప్తి చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అర్థమయ్యే విధంగా పోలీసులు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మొత్తం క్ర‌మంలో తనకు మద్దతు ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యాంకర్ ప్రదీప్ చెప్పారు.