Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో ఎప్పుడూ చూడని సీన్ ఒకటి చోటు చేసుకుందట

By:  Tupaki Desk   |   23 Aug 2022 7:30 AM GMT
ప్రగతిభవన్ లో ఎప్పుడూ చూడని సీన్ ఒకటి చోటు చేసుకుందట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రగతి భవన్ కు మధ్యనున్న అనుబంధం గురించి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత.. తెలంగాణ సీఎం ఉండాల్సిన నివాసాన్ని తన అభిరుచికి తగ్గట్లుగా కట్టించుకున్న ఆయన.. దాని కోసం భారీగా ఖర్చు చేసిన వైనం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న విమర్శల గురించి తెలిసిందే. వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నివాసంలోకి మంత్రులకు సైతం ఎంట్రీ ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

తాను ఎవరినైతే కలవాలని భావిస్తారో వారిని మాత్రమే ప్రగతిభవన్ లో కలుస్తారని.. అంతకు మించి ఉత్సాహంతో ఎవరైనా కలవాల్సి వస్తే మాత్రం.. వారిని లోపలకు కూడా రానివ్వరని.. అది సొంత పార్టీ నేతలైనా అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తనకు నచ్చిన వారిని ఒకటికి పదిసార్లు పిలిచి రప్పించుకునే అలవాటున్న కేసీఆర్.. ఎప్పుడూ తన కుటుంబ సభ్యులను వేరే వారి ముందు ఆగ్రహం వ్యక్తం చేయటం కనిపించదని చెబుతారు.

అందునా ఆయన అమితంగా ఇష్టపడే కుమార్తె కవితను పల్లెత్తు మాట అనరని చెబుతారు. కేసీఆర్ కుటుంబంతో వ్యక్తిగతంగా దగ్గరగా ఉండే వారి మాటల ప్రకారం.. మీటింగ్ లలో కొన్నిసార్లు కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ ను రెండు మాటలు ఇట్టే అనేసే అలవాటున్న కేసీఆర్.. కుమార్తె కవితను మాత్రం పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరని చెబుతారు. ఆ మాటకు వస్తే.. కేటీఆర్ కంటే కూడా కవిత మాటకే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తన రాజకీయ వారసుడు ఎవరన్న విషయంపై క్లారిటీ ఉన్న కేసీఆర్.. కేటీఆర్ కు పగ్గాలు ఇవ్వటం తెలిసిందే.

అయితే.. ఇంట్లో మాత్రం కేటీఆర్ కంటే కూడా కవిత మాటలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని చెబుతారు. ఆమె ఏదైనా అడిగితే.. నో చెప్పే అలవాటు కేసీఆర్ కు ఉండదంటారు. అలాంటి కేసీఆర్ తాజాగా మాత్రం కుమార్తె కవితపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రగతిభవన్ లో ఎప్పుడూ చూడని సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు లింకులు ఉన్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారటం.. ఢిల్లీ బీజేపీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయటం తెలిసిందే.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. ఈ కొత్త చికాకు విషయంలో కేసీఆర్ ఆగ్రహం ఉన్నట్లు చెబుతున్నారు. లేని కంపను మీద వేసుకున్న చందంగా కుమార్తె వ్యవహరించారన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్నది తన ఆలోచన అయితే.. అందుకు భిన్నంగా పరిస్థితులు ఎదురైనట్లుగా ఆయన మాటలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్ లో ఎప్పుడూ ఇలాంటి సీన్ చోటు చేసుకోలేదని.. మొదటిసారి ఇలాంటిది జరిగినట్లుగా చెబుతున్నారు. తన కుమార్తెపై ఢిల్లీ బీజేపీ నేతలు బురద జల్లిన విషయాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి తగినట్లుగా బీజేపీకి పంచ్ లు ఇవ్వాలన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందంటున్నారు.