Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్ లో అలాంటి సీన్.. కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు?

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:20 AM GMT
ప్రగతి భవన్ లో అలాంటి సీన్.. కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనేం కావాలనుకుంటే అది మాత్రమే అందుబాటులోకి రావటం.. మిగిలినవేవీ ముందుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. తన చుట్టూ తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటంలో గులాబీ బాస్ తర్వాతే ఎవరైనా. చివరకు తన కేబినెట్ లోని సహచరులకు సైతం అందుబాటులోకి రాకుండా పోవటం ఆయనకే చెల్లుతుందంటారు. అలాంటి కేసీఆర్ ను కలవాలన్నా.. ఆయన నివాసం ఉండే ప్రగతి భవన్ లోపలకు వెళ్లాలంటే అదో పెద్ద ప్రొసీజర్. సారు నుంచి పర్మిషన్ ఉండే తప్పించి.. రాజమహాల్ ను తలపించే ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఉండదంటారు.

అలాంటి చోట.. ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని విచిత్రమైన పరిస్థితి కేసీఆర్ కు ఎదురైనట్లుగా చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో.. కేసీఆర్ కు ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావటం.. ఇలాంటి పరిస్థితి అసలెందుకు ఎదురైందన్నది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి లోతుగా ఎక్స్ ర్ సైజ్ చేసే ఆయన.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి సరైన ప్లానింగ్ లేకుండా తొందరపాటును ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది.

అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాత మాత్రమే ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో సానుకూల ప్రకటన చేయాల్సిన దానికి భిన్నంగా.. ఏకపక్షంగా తాను డిసైడ్ చేసిన వ్యక్తిని గెలిపించాలన్న కేసీఆర్ ధోరణి.. ప్రగతి భవన్ సాక్షిగా ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ప్రగతిభవన్ లో ఇంతకు ముందెప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. మునుగోడు ఉప పోరులో అభ్యర్థిని డిసైడ్ చేసే విషయంలో ఓవైపు చర్చలు జరుపుతున్నట్లే జరుపుతూ.. మరోవైపు పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా డిసైడ్ చేసినట్లుగా లీకులు.. అధికార మీడియాలోనూ క్వశ్చన్ మార్కుతో వార్తలు రావటంపై టీఆర్ఎస్ నేతలు పలువురు అగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి.

ఇలాంటి వారిని కంట్రోల్ చేయటానికి వీలుగా ప్రగతి భవన్ కు తీసుకొస్తే సరిపోతుందని.. వారి తీరు మారుతుందని వేసుకున్న అంచనా అడ్డంగా ఫెయిల్ కావటమే కాదు.. అసలు ఇలాంటి తప్పులు ఎందుకు జరిగాయా? అన్న ఆలోచనలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీలు.. జడ్పీటీసీలు.. సర్పంచ్ లను తీసుకొచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి.. వారంతా పార్టీ లైన్ కు కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వారితో చర్చలు జరిపి.. ఆ సారాంశాన్ని ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కల్పించారు. ఈ సందర్భంగా తామంతా పార్టీ చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పారు. దీంతో.. ఖుషీ అయిన కేసీఆర్ వారి వద్ద కాసేపు గడిపి సెలవు తీసుకున్నారు.

ఇంతవరకు సీన్ బాగానే జరిగినా.. ఇక్కడే తేడా కొట్టేసింది. ప్రగతిభవన్ కు తీసుకెళ్లింది తమతో చర్చించటానికి కాదు.. పెద్ద సారు చేసిన ఆలోచనను అమలు చేయటానికి.. ఆ విషయాన్ని అధినేతతో తమకు నేరుగా చెప్పించటానికి చేసిన ప్రయత్నంగా వారు గుర్తించారు. అంతే.. చౌటుప్పల్ లోని ఒక ఫంక్షన్ హాల్ పెట్టి సమావేశాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తుందన్న మాటను తేల్చి చెప్పిన వైనం షాకింగ్ గా మారింది.

ప్రగతిభవన్ కు వచ్చి ఎంచక్కా సారు మాటల్ని విన్న వారు.. ఆ వెంటనే సమావేశం పెట్టుకొని.. అధినేత ఆలోచనకు భిన్నమైన తీర్మానం చేయటం ఇదే తొలిసారని.. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ జరగలేదంటున్నారు. ప్రగతిభవన్ సాక్షిగా తమకు షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది. ఇదంతా సరైన ఎక్స్ ర్ సైజ్ లేకుండా.. మెజార్టీ అభిప్రాయాన్ని తెలుసుకోని కారణంగా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.