Begin typing your search above and press return to search.

హైద‌రబాదీల‌పై మోడీ త‌మ్ముడి జోక్‌

By:  Tupaki Desk   |   26 Nov 2016 11:57 AM GMT
హైద‌రబాదీల‌పై మోడీ త‌మ్ముడి జోక్‌
X
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌పై పెద్ద జోక్ వేశారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌హ్లాద్ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల ముఖాలను చూస్తుంటే ఇక్కడ కరెన్సీ సమస్యలేదని తనకు అనిపిస్తోందని ప్ర‌హ్లాద్ మోడీ అన్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌జలంతా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యం ఫ‌లాలు అంద‌రికీ అందుతాయ‌ని వివ‌రించారు.

క‌రెన్సీ ర‌ద్దు వల్ల‌ కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ అవ‌న్నీ తాత్కాలిక‌మైన‌వ‌ని ప్ర‌హ్లాద్ మోడీ వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్షాలు పిలుపు నిచ్చిన భార‌త్ బంద్ గురించి మీడియా ప్ర‌స్తావించ‌గా ప్ర‌తిప‌క్షాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌న్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యం విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రికి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌హ్లాద్ మోడీ వ్యాఖ్యానించారు. కాగా హైదరాబాద్ రావడం తనకెంతో ఆనందంగా ఉందని ప్ర‌ధాన‌మంత్రి సోద‌రుడు అన్నారు. చౌమొహల్లా, సాలర్ జంగ్ మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాలను కూడా ఆయన సందర్శించనున్నారు.