Begin typing your search above and press return to search.

ఇదే ప్ర‌జాకూట‌మి సీట్ల ఫైనల్ లెక్క‌

By:  Tupaki Desk   |   26 Oct 2018 2:24 PM GMT
ఇదే ప్ర‌జాకూట‌మి సీట్ల ఫైనల్ లెక్క‌
X
బ‌ల‌మైన ప్ర‌త్యర్థిని ఢీకొట్టేందుకు.. భేషజాలకు పోకుండా పట్టువిడుపుల దోరణి అవలంభించాలని… ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకొని మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ..సీట్ల పంచాయతీతో ట్విస్టుల మీద ట్విస్టులు అన్న‌ట్లుగా సాగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు - అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రంగంలోకి దిగి పొత్తుకు తుది రూపం ఇచ్చింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను.. కాంగ్రెస్‌ 90 సీట్లలో - టీడీపీ 15 - టీజేఎస్‌ 10 - సీపీఐ 4 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, మహాకూటమి వేదికగా అభ్యర్థులను ప్రకటించ‌నున్న‌ట్లు స‌మాచారం. శనివారం లేదా ఆదివారం రాత్రికల్లా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన వీడే అవకాశముందని, అన‌త‌రం ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌ని తెలుస్తోంది.

పొత్తుల స్తంభ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం.. మిత్రులను సంతృప్తి పరిచేలా పొత్తు కొనసాగాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ నేతలు టీజేఎస్‌ - సీపీఐల అసంతృప్తిని చల్లార్చినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియా - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ - టీజేఎస్ - సీపీఐ ముఖ్య నేతలు ఎల్‌. రమణ - కోదండరాం - చాడ వెంకటరెడ్డి తదితరులతో కీలక చర్చలు ప్రారంభించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు, ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నాలుగు పార్టీల నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు.ప్రాథమికంగా జరిగిన చర్చల్లో 70–75 స్థానాల్లో రాజకీయ పరిస్థితులు - పార్టీల బలాబలాలపై ఆయా పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. మిగిలిన స్థానాలపై శుక్రవారం నాటికి ఓ అంచనాకు రానున్నారు. ఆ తర్వాత మరోమారు అన్ని పార్టీల నేతలు సమావేశమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం. పొత్తులో భాగంగా, మహాకూటమి తొలి జాబితాను 40 నుంచి 50 మంది అభ్యర్థుల పేర్లతో ప్రకటిస్తారని తెలుస్తోంది. టీడీపీ నుంచి 8మంది - టీజేఎస్‌ నుంచి ఐదుగురు - సీపీఐ నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.శనివారం లేదా ఆదివారం రాత్రికల్లా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన వీడే అవకాశముందని స‌మాచారం.

పార్టీల ప‌రంగా చూస్తే...తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే, టీడీపీ అడుగుతున్న‌ మెజారిటీ స్థానాల్లో తమకు దీటైన అభ్యర్థులున్నందున ఈ స్థానాలను ఇవ్వలేమని కాంగ్రెస్‌ అంటోంది. తదుపరి చర్చల్లో ఈ సీట్లపై కాంగ్రెస్ - టీడీపీ మధ్య స్పష్టత రావాల్సి ఉంది. ఇక తొలుత 12 స్థానాలను ఇవ్వాలని పట్టుపట్టిన సీపీఐ ఆ తర్వాత 9 స్థానాలతో సరిపెట్టుకుంటామని చెప్పింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం 4–5 స్థానాలను ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కోదండ‌రాం పార్టీ విష‌యంలో మూడు స్థానాల‌కు కాంగ్రెస్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. మ‌రో నాలుగు స్థానాల‌ను టీజేఎస్ అడుగుతున్న‌ప్ప‌టికీ...హ‌స్తం పార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా లేన‌ట్లు పేర్కొంటున్నారు.