Begin typing your search above and press return to search.

జాలి చూపని బాలినేని...తాడో పేడో...?

By:  Tupaki Desk   |   11 April 2022 8:53 AM GMT
జాలి చూపని బాలినేని...తాడో పేడో...?
X
ఆయన మామూలు నేత కాదు, ఏకంగా వైసీపీ అధినేతకు దగ్గర చుట్టం. తాను నాలుగేళ్ళ పాటు మంత్రి పదవి కాంగ్రెస్ లో ఉండగానే రాజీనామా చేసి వచ్చేశారు. జగన్ వెంట నడిచారు. నాడు జగన్ గెలుస్తారా లేదా అని కూడా కనీసంగా ఆలోచన చేయలేదు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగానే మెలిగారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉనన్ బాలినేని ఇపుడు వైసీపీలో ఒక్కసారిగా అసమ్మతి నేతగా మారిపోయారు.

హై కమాండ్ కి ఒక్క లెక్కన బీపీ పెంచేస్తున్నారు. ఆయన దారికి రావడంలేదు. ఎవరి మాట వినడంలేదు. ఇక తన వద్దకు రాయబారానికి వచ్చిన సజ్జల రామక్రిష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల వద్ద కూడా జగన్ గురించి కటువుగానే మాట్లాడారని సమాచారం. వైఎస్సార్ తనకు రాజకీయ జన్మ ఇస్తే కొడుకు జగన్ గొంతు కోశారు అంటూ తీవ్రంగానే పదజాలం వాడినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఒకే ఒక్క జగన్ కోసం తాను నాలుగేళ్ళ మంత్రి పదవీ కాలం వదిలేసుకుని వస్తే కనీసం ఆ నాలుగేళ్ళూ కూడా ఇక్కడ పదవిని కొనసాగించకపోవడం కంటే దారుణం ఏమైనా ఉంటుందా అని తన దగ్గరకు వచ్చిన వారినే నిలదీసినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని మీరే నడుపుకోండి అని ఒక దశలో బాలినేని గట్టిగానే చెప్పేసినట్లుగా తెలుస్తోంది.

తాను ఎంతమాత్రం తగ్గేది లేదని, తనను అవమానించారని బాలినేని అంటున్నారుట. ఇక తమ సామాజికవర్గానికి చెందిన పొరుగు జిల్లా నేతలను కంటిన్యూ చేస్తూ తనను పక్కన పెట్టడం కంటే దారుణమైన పరాభవం వేరొకటి లేదని ఆయన అంటున్నారు. తాను పార్టీ కోసం కష్టపడితే ప్రతిఫలం ఇదా అని ఆయన అంటున్నారుట.

ఇక తాను పార్టీలో ఉండడం ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి బాలినేనిని దారికి తేవడం కష్టమని వైసీపీ హై కమాండ్ కి ఈపాటికే అర్ధమైపోయింది. బాలినేని కనుక చల్లారకపోతే మాత్రం వైసీపీలో కొత్త చిచ్చు మరింతగా రాజుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. బాలినేని విషయంలో ఏం చేయాలో కూడా పాలుపోని హై కమాండ్ పెద్దలు జాలి చూపవా బాలినేని అని బతిమాలాల్సి వస్తోందిట.

ఏది ఏమైనా బాలినేని తగ్గడంలేదు అన్నది లేటెస్ట్ టాక్. ఆయన తీరు అలా ఉంటే ఆయన వర్గం ఎమ్మెల్యేలు వరసబెట్టి ఇక రాజీనామాలు సంధిస్తారు అని తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా రాజీనామాలు కనుక చేస్తే మాత్రం ఇక మరింతగా రాజకీయ ఇబ్బందులు ఎదురు అవుతాయి. అంతవరకూ పరిస్థితి రాకుండా చూడాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది కానీ అక్కడ ఉన్నది బాలినేని. ఆయన జగన్ తోనే తాడే పేడో అనేస్తున్నారు. దాంతో బాలినేని తలనొప్పులు ఇప్పట్లే తగ్గేలా లేవు అని అంటున్నారు.